దటీజ్ ప్రభాస్, సమంత.. చరణ్, తారక్, బన్నీ ర్యాంక్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ లో నెంబర్. 1 హీరో ఎవరని అడిగితే.. ప్రతీ అభిమాని తమ ఫేవరెట్ హీరో పేరు చెప్పుకుంటారు. కానీ తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం టాప్ - 10 హీరోల లిస్ట్ బయటకు వచ్చింది. మరి ఈ జాబితాలో ఏ హీరో ఏ స్థానంలో ఉన్నారంటే..
ప్రముఖ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రకారం.. ఎప్పటిలాగే ఈ సారి జూన్ నెలకు గానూ మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ హీరోల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొదటి స్థానం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కైవసం చేసుకున్నారు. ఆయన ఇటీవలే 'ఆదిపురుష్' తో.. బాక్సాఫీస్ ముందు సందడి చేశారు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అంతకుముందు నటించిన 'సాహో', 'రాధేశ్యామ్' కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో ఆయన అభిమానులంతా త్వరలో రానున్న 'సలార్', 'ప్రాజెక్ట్ కె'పై భారీ ఆశలు పట్టుకున్నారు.

చరణ్ కన్నా ఎన్టీఆరే ముందు..: రెండో స్థానంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆయన ఈ ఘనతను అందుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. అయితే ఇదే 'ఆర్ఆర్ఆర్'తో సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ మాత్రం నాలుగో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ 'గేమ్ ఛెేంజర్' సినిమా చేస్తున్నారు.

అదీ అల్లు అర్జున్ రేంజ్..: ఇక మూడో స్థానంలో 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. ఆయన క్రేజ్ ఏంటో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' చేస్తున్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని తర్వాత ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నారు. అనంతరం సందీప్ వంగాతో మరో భారీ బడ్జెట్ సినిమా చేస్తారు.

మహేశ్ కాస్త డౌన్..: ప్రస్తుతం వరుస హిట్లతో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం వెనకపడ్డారు. ఆయన ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఆయన రాజమౌళితో కలిసి భారీ అడ్వెంచర్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రంతో ఆయన పాన్ వరల్డ్ హీరో అవ్వడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

లాస్ట్ లో దేవరకొండ, చిరు..: ఇక రాజకీయాల్లో ఫుజ్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆరో ర్యాంకును అందుకున్నారు. త్వరలోనే 'బ్రో' సినిమాతో రానున్న ఆయన చేతిలో 'హరిహరవీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ' సినిమాలు ఉన్నాయి. ఈయన తర్వాత 'దసరా'తో వంద కోట్ల హీరోగా మారిన నేచురల్ స్టార్ నాని నిలిచారు. ప్రస్తుతం 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ తో 'హయ్ నాన్న' చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చిరంజీవి, విజయ్ దేవరకొండ, రవితేజ నిలిచారు.
హీరోయిన్స్ విషయానికొస్తే..: 'శాకుంతలం'తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కాజల్ ఉండగా.. మూడేళ్ల నుంచి సైలెంట్ గా ఉన్న అనుష్క శెట్టి మూడో స్థానంలో నిలవడం విశేషం. సాయిపల్లవి, కీర్తిసురేశ్ నాలుగు, ఐదో ర్యాంకును అందుకున్నారు. అయితే ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న శ్రీలీల.. ఆరో స్థానానికి పరిమితమైంది. రష్మిక, పూజా హెగ్డే, తమన్నా, అనుపమ.. తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications











