Padma Awards 2024: పద్మ అవార్డులపై స్పందించిన పవన్ కల్యాణ్.. చిరంజీవి, వెంకయ్యనాయుడిపై ఎమోషనల్‌గా!
దేశంలో సినీ, కళారంగం, విద్య, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రతీ ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే ఈ అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది తెలుగు తేజాలు మెగాస్టార్ చిరంజీవి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత, పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ ఓ ప్రకటనను విడుదల చేస్తూ..
భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని 'పద్మవిభూషణ్' పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు.

అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో తెలిపారు.
ఇక మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు గారు 'పద్మవిభూషణ్' పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన శ్రీ వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవి. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారు. రాజకీయ ప్రస్థానంతోపాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీ వెంకయ్య నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను అని తన ప్రకటనలో ప్రశంసలతోపాటు అభినందనలు తెలిపారు.


Click it and Unblock the Notifications











