‘పద్మావతి’ వివాదం : ప్రధాని మోడీ వరకు వెళ్లిన పంచాయితీ!
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమా వివాదం ముదురుతోంది. ఈ సినిమాను ఆపేయాలంటూ తాజాగా మేవార్ రాజవంశీయులు ప్రధానికి లేఖ రాశారు.
రాణి పద్మావతి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'పద్మావతి' సినిమాపై కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాణి పద్మావతి పాలిస్తున్న చిత్తోర్ కోటను 1303 సంవత్సరంలో ఉల్లాఉద్దీన్ ఖిల్జీ ముట్టడించాడు. ఆ యుద్ధం ఎపిసోడ్ ను ప్రధానంగా ఫోకస్ చేస్తూ 'పద్మావతి' చిత్రం తీశారు.
అయితే ఈ సినిమాలో పద్మావతి విషయంలో చరిత్రను వక్రీకరించారని రాజ్ పుత్ వంశీయులు ఆరోపిస్తున్నారు. రాజ్ పుత్ కర్ణి సేన ఈ విషయంలో ఆందోళన చేస్తూ దాడులు చేయగా... తాజాగా ఉదయ్ పూర్ మేవార్ రాజవంశస్థులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమాను ఆపాలంటూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.

మేవార్ రాజవంశస్థుడు ఎంకే విశ్వరాజ్ సింగ్
తమ రాజపుత్రుల చరిత్రను వక్రీకరించి, రూపొందించిన 'పద్మావతి‘ సినిమా విడుదలను ఆపేయాలని నరేంద్ర మోడీ, సీబీఎఫ్‌సీ ఛైర్మన్ ప్రసూన్ జోషి, సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీ, మానవ వనరులు, అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా తదితరులకు మేవార్ రాజవంశస్థుడు ఎంకే విశ్వరాజ్ సింగ్ లేఖ రాశారు.

చరిత్రను కాపాడండి
రాజపుత్రుల చరిత్రను ఈ సినిమాలో పూర్తిగా వక్రీకరించారని, హిందువుల చరిత్రతో పాటు భారతదేశ చరిత్రను కాపాడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందని, ఈ సినిమాను వెంటనే ఆపాలని విశ్వరాజ్ సింగ్ లేఖలో పేర్కొన్నారు.

మమ్మల్ని సంప్రదించలేదు
రాణీ పద్మావతిపై పరిశోధన చేశామని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అంటున్నారు. తమను మాత్రం దర్శకుడు సంప్రదించలేదు. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని భావిస్తున్నాం. ఇలాంటి సినిమాలు జాతికి ప్రమాదమని విశ్వరాజ్ సింగ్ పేర్కొన్నారు.

డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు
దీపిక పదుకోన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ వివాదం నేపథ్యంలో సినిమా విడుదల అవుతుందా? లేదా? అనేది హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











