Pahalgam Attack: ఉగ్రవాద ఉన్మాదం, సభ్య సమాజం సిగ్గుపడేలా.. గుండె పగిలింది.. నాని, విజయ్, మహేష్, అల్లు అర్జున్
భూతల స్వర్గం జమ్ము, కాశ్మీర్ ఉగ్రవాదుల కాల్పులతో చిందిన రక్తంతో పహల్గావ్ ప్రాంతం తడిసి ముద్దైంది. కశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై టెర్రరిస్టులు క్రూరమైన దాడికి పాల్పడిన ప్రపంచవ్యాప్తంగా అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఉగ్రవాదుల ఉన్మాద చర్యలను ప్రపంచవ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నది. ఈ విషాద సంఘటనపై సినీలోకం కూడా స్పందిస్తున్నది. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నది. ఈ ఘటనపై సినీ ప్రముఖుల స్పందన వివరాల్లోకి వెళితే..
పహల్గావ్‌లో ఉగ్రవాదుల దాడి అత్యంత విషాదకరం. మానవ చరిత్రలో చీకటి రోజు. ఈ క్రూరమైన దాడిని ముక్తకంఠంతో ఖండించాలి. బాధితులకు మనోధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషాద సమయంలో గుండె పగిలిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

కశ్మీర్‌లోని పహల్గావ్‌లో ఉగ్రవాదుల దాడి ఘటన అత్యంత దురదృష్టకరం. అమాయకులైన పర్యాటకులపై పిరికిపందలుగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. పౌరసమాజంలో ఉగ్రవాదానికి చోటు ఉండకూడదు. ఇలాంటి హేయమైన చర్యకు తావులేదు. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఈ సంఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని నటుడు సోనుసూద్ ట్వీట్ చేశారు.
కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడిని నేచురల్ స్టార్ నానీ ఖండించారు. మూడు నెలల క్రితం మేము అక్కడ ఉన్నాం. దాదాపు 200 మంది 20 రోజులపాటు అక్కడే షూట్ చేశాం. అక్కడి ప్రజలు, ప్రాంతం చాలా గొప్పది. ఉగ్రవాదుల దాడి ఘటన విన్న తర్వాత గుండె ముక్కలైంది. నోటి నుంచి మాటలు రావడం లేదు. ఎందుకు ఈ మారణహోమం అని నేచురల్ స్టార్ నాని ఆవేదన వ్యక్తం చేశారు.
పహల్గావ్ ఉగ్రదాడి ఘటన విన్న వెంటనే నా గుండె ముక్కలైంది. దయతో కూడిన ప్రజలు, అందమైన ప్రదేశంలో ఇలాంటి క్రూరమైన దాడినా? బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మృతుల బంధువులు, సన్నిహితులకు మనోధైర్యం ఇవ్వాలని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతడిని కోరుకొంటున్నాను అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సంతాపాన్ని ట్వీట్స్ రూపంలో వెల్లడించారు.
కశ్మీర్‌లోని పహల్గావ్‌లో రెండేళ్ల క్రితం నా పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకొన్నాను. స్థానిక కశ్మీర్ స్నేహితులు, యూనిట్ సభ్యులు ఆనందం సంబురాలు ఇంకా నాకు గుర్తుకు ఉన్నాయి. అక్కడి ప్రజలు చూపించే ప్రేమ, ఆదరణ గొప్పగా ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఉగ్రవాదుల చేష్టలు అత్యంత దారుణం. సభ్య సమాజం సిగ్గుపడేలా టూరిస్టులపై దాడులు చేయడం పిరికిపంద చర్య. తుపాకులతో ఉగ్రవాదులు నీచమైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబాలకు మనోధైర్యం కలగాలి. వారికి నా ప్రగాఢ సంతాపం అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











