ఆ సత్తా మా సొంతం: బాలయ్య
'పాండురంగడు" ఆడియో ఆవిష్కరణ వేడుక మచిలీపట్నంలోని పాండురంగ దేవస్థానంలో ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు. కృష్ణా జిల్లా కలెక్టర్ సుజాతా రామయ్యర్ ఆడియో క్యాసెట్లు, సీడీలను ఆవిష్కరించారు. తొలి క్యాసెట్‌ను బాలకృష్ణకు, తొలి సీడీని కె. విశ్వనాథ్‌కు అందించారు.ఆవిష్కరణ అనంతరం హీరో బాలకృష్ణ 'భైరవ ద్వీపం", 'ఆదిత్య 369′ వంటి సినిమాల్లో తాను చేసిన వైవిధ్యమైన పాత్రల్ని ప్రేక్షకులు ఆదరించారనీ, మళ్లీ ఇప్పుడు 'పాండురంగడు" సినిమాలో వైవిధ్యమైన పాత్రలతో అభిమానుల ముందుకు వస్తున్నాననీ ఆయన అన్నారు. "అప్పట్లో నాన్నగారు రాముడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, రావణుడు వంటి పాత్రలు పోషించి ఎంతగానో మెప్పించారు. ఆ తరహా పాత్రలు చేసి మెప్పించగలిగిన సత్తా మా నందమూరి వంశానికి మాత్రమే వుంది. నేను కూడా ఆయన బాటలోనే నడుస్తూ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పాత్రలు పోషించడానికి కృషి చేస్తా" అని బాలకృష్ణ చెప్పారు.
"నిత్య జీవితంలో ఒత్తిడులు ఎదుర్కొనేవారికి మధురమైన సంగీతం టానిక్‌లాంటింది. 'పాండురంగడు" సంగీత సరిగ్గా అలాంటిదే. ఆధునిక జీవితంలో తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్న వారికి ఈ పాటలు కనువిప్పు కలిగిస్తాయి. కీరవాణి సంగీత నైపుణ్యం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అన్నమయ్య", 'శ్రీరామదాసు" సినిమాలకు ఆయన సమకూర్చిన సంగీతం ఏ స్థాయిదో అందరికీ తెలుసు. 'పాండురంగడు"కు ఆయన అందించిన సంగీతం అద్భుతం" అని బాలకృష్ణ ప్రశంసించారు. అలాగే "ఇప్పుడొస్తున్న పాటలు వింటుంటే తెలుగుకి తెగులు పుట్టిందేమోననిపిస్తోంది. కవులేమే తాము నిర్మాతల అభిరుచి మేరకు రాస్తున్నామని చెబుతున్నారు. సంగీత దర్శకులు పాశ్చాత్య సంగీతాన్ని అనుకరించక తప్పడం లేదంటున్నారు. ఇవాళ, కథకు, కథాగమనానికి అనుగుణమైన పాటలు కరువయ్యాయి" అని ఆవేదన వెళ్ళబుచ్చారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత కె. కృష్ణమోహనరావు, రచయిత జె.కె. భారవి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్, హీరోయిన్లు స్నేహ, సుహాసిని, వేద, గేయ రచయితలు వేదవ్యాస, సుద్దాల అశోక్‌తేజ, సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











