పవన్ కళ్యాణ్ గురించి పరుచూరి పలుకులు.... ఫ్యాన్స్ వినాల్సిన 5 విషయాలు!
ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమాలను వదిలేసి రాజకీయాల బాట పట్టిన పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ అభిమానులు వింటే ఫిదా అవ్వడం ఖాయం అనేలా ఉన్నాయి.
చాలా మంది నన్ను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అడుగుతున్నారు. మనం కోరుకున్న ఒక వ్యక్తి ఒక మార్గంలో వెళ్లినపుడు కొంత దూరంలో ఆయన ప్రయాణించే మార్గంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు, దాన్ని బట్టి మనకు స్పష్టత వచ్చిన తర్వాత మాట్లాడాలి. అందుకే ఆయన గురించి నేను తర్వాత మాట్లాడతానన్నారు. ప్రస్తుతం ఆయన పాటిస్తున్న ఐదు సూత్రాల గురించి వివరించారు.

దాన్ని పక్కన పెట్టేశారు
నేను రాజకీయాల్లోకి నా కోసం రాలేదు, జనం కోసం వచ్చాను... ఇలా అన్నవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అటువంటి మహానుభావులు ప్రజా సేవ కోసమే వచ్చేవారు, కుర్చీ కోసం వచ్చేవారు కాదు. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజున ఓ విషయం చెప్పాను. సినిమా రంగంలో ఆయన స్థానం ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. దాన్ని పక్కనపెట్టి ఈ రోజు వీధుల్లో జనం కోసం తిరుగుతున్నారని పరుచూరి చెప్పుకొచ్చారు.

ఆ మాట చెప్పడం గ్రేట్
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. 2014లో ప్రచారం చేసినపుడు పవన్ కళ్యాణ్ ఎమోషన్స్ గమనిస్తే అతడు ఇంకా హీరో. ఆయన మాటల్లో ఒక ఆవేశం. అయితే తర్వాత ఆయనకు రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఉండవు అని అర్థం చేసుకున్నారు. రాజ్యాంగ సంక్షోభం వచ్చినపుడు, రాజకీయ లోటు ఏర్పడినపుడు కలవ కూడని వారు కూడా కొన్ని సార్లు కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం స్వయంగా ఇపుడు పవన్ కళ్యాణ్ చెప్పడం గ్రేట్.

ఈ మాటకు ఎవరైనా శభాష్ అనాలి
గెలిచినా... ఓడినా.. రాజకీయాల్లో ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు. ఈ మాటకు ఎవరైనా శభాష్ అనాలి. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాలకు దూరం అయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఒకసారి రాజకీయాల్లోకి దిగిన తర్వాత చివరి వరకు పోరాటం చేయాలి. పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్ 18 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఫైనల్‌గా ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నాడు. గెలుపు, ఓటుమలు నీ రాజకీయ లక్ష్యాన్ని, రాజకీయ ప్రయాణాన్ని ఆపకూడదు. ఈ మాట పవన్ కళ్యాణ్ తన నోటి నుండి చెప్పడం అద్భుతం.

దీనికి హాట్సాఫ్ అనాల్సిందే
నాలుగో సూత్రం.... నాకు బాగా నచ్చింది. నోట్లతో ఓట్లు కొనేవారు కాదు, వారి మంచి తనంతో ఓట్లు సంపాదించేవారు నాకు కావాలి అన్నారు. నాడు ఎన్టీ రామారావును చూసి ఓటేశారు, ఇందిరమ్మను చూసి ఓటేశారు, చిరంజీవిగారిని చూసి 84 లక్షల ఓట్లు వేశారు. ఎంజీఆర్, జయలలితను చూసి ఓట్లు వేశారు. కానీ గెలిచే ఓటు స్థానిక అభ్యర్థి ద్వారా వస్తాయి. అది వారు వారి క్యారెక్టర్ ద్వారా అయినా సంపాదించాలి లేదా డబ్బుతో సాధించినట్లు కూడా వింటున్నాము. కానీ పవన్ కళ్యాణ్ నాకు మంచి తనంతో ఓట్లు సంపాదించే వారు కావాలి, వారికే సీట్లు అని చెప్పడం హాట్సాఫ్.

ఆయన చెప్పలేదు కానీ...
ఐదో సూత్రం... ఆయన నోటితో ఇంకా చెప్పలేదు. ఆయన చేస్తున్న చర్యల వల్ల నాకు అర్థమైంది. మన పరువు తీసేవారు, మన విలువ తగ్గించేవారు మనతో రాకూడదు. నేను 1982 ఎన్టీ రామారావుగారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. ఆల్రెడీ వీపు మీద రాజకీయ బురద ఉన్న వారిని మీ పార్టీలో చేర్చుకోకండి అని చెప్పాను. ఆ తర్వాత చిరంజీవిగారితో కూడా ఎన్నికల్లో నిల్చొని గెలిచి ఓడిపోయి క్యారెక్టర్ పోగొట్టుకున్న చాలా మంది సీట్లు రావడం లేదని కొత్త పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి అలాంటి వాళ్లను తీసుకోవద్దని చెప్పాను. పవన్ కళ్యాణ్ కు ఇపుడు నేను చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ఆయన ఒక టీంను ఏర్పాటు చేసుకున్నాడు.... అని పరుచూరి అన్నారు.


Click it and Unblock the Notifications











