రవితేజ ‘సార్ వస్తారా’లో పరూల్ యాదవ్?
మాస్ మహారాజ రవితేజ హీరోగా, పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'సార్ వస్తారా' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి హీరోయిన్‌గా మొన్నటి వరకు నయనతార పేరు వినిపించినప్పటికీ తాజాగా కన్నడ భామ పరూల్ యాదవ్ ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారని, త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బేనర్‌పై రూపొందిస్తున్నారు. యువత, సోలో చిత్రాలు దర్శకత్వం వహించిన పరశురాం దర్శకుడు. గతంలో పరశురాం దర్శకత్వంలో రవితేజ హీరోగా 'ఆంజనేయులు' చిత్రం రూపొందింది. అయితే ఆ చిత్రం నిరాశ పరిచింది.
'సార్ వస్తారా' చిత్రం జూలైలో సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. మహేష్ బాబు నటించిన బిజినెస్ మేన్ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ పాట పేరే ఈ టైటిల్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఇందులో రవితేజ సరసన ఇలియాన నటిస్తోంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాడు క్రేజీ డైరెక్టర్ పూరి.
ఇక రవితేజ నటించిన 'దరువు' చిత్రం మే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈచిత్రం ఆడియో నిన్నవిడుదలైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











