రంగంలోకి పవన్ ఫ్యాన్... బెదిరింపులు, ఆందోళనలు!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాపై తెలంగాణ వివాదం నెలకొన్న నేపథ్యంలో సినిమాను తెలంగాణ ప్రాంతలో కష్టాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు రంగంలోకి దిగారు. తెలంగాణలో వెల్లు వెత్తిన నిరసనపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తపరిచారు.
పవన్ కళ్యాణ్‌కు వారు మద్దతుగా నిలిచారు. సినిమా ప్రదర్శనను అడ్డుకోవడానికి నిరసనగా గుంటూరు జిల్లాలోని ఏటికూరు బైపాస్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా అభిమానులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మరో వైపు హైదరాబాద్‌లో కూడా అభిమానులు ర్యాలీలు దర్నాలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా... తనకు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి నరికి చంపుతాం అంటూ బెదిరింపు కాల్స్, ఎస్ఎంఎస్ లు వస్తున్నాయని తెలంగాణ ప్రాంత దర్శకుడు ఎన్.శంకర్ ఆరోపించారు. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న మాట వాస్తవమే అని, తెలంగాణ వాదులు చేస్తున్న ఆందోళనలు సబబే అని సమర్థించారు. సినిమాలో మరిన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయని శంకర్ ఆరోపించారు.
ఇటీవల ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డుకు ఎంపికైన శంకర్.... ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సినిమా తెలంగాణకు వ్యతిరేకంగా ఉందనే వాదనకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ నేపథ్యంలో తమ హీరో సినిమాను నష్టపరుస్తున్నాడనే కోపంతో పవన్ అభిమానులు శంకర్‌ను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











