పవన్ 'జన సేన' బహిరంగ సభ వేదిక మార్పు
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ స్థాపించిన 'జన సేన' తొలి బహిరంగ సభ ఈనెల 27న విశాఖలో జరగనుంది. ఈ సభను బీచ్ రోడ్డులో నిర్వహించాలని భావించినప్పటికీ... జిల్లా అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో వేదికను వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని(మునిసిపల్) స్టేడియానికి మార్చారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయడాలని ఇక్కడి పార్టీ ప్రతినిధులకు సమాచారం పంపారు. భారీగా జనసమీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పవన్ అభిమానులు వస్తారని స్థానిక ప్రతినిధులు చెబుతున్నారు. ఈ వేదికపై పార్టీ విధి విధానాలు వివరించే అవకాశం వుంది. మరోప్రక్క పవన్ కల్యాణ్ 'కమలం'తో దోస్తీ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్‌లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీతో పవన్ భేటీ అవుతున్నారు.

బీజేపీ, టీడీపీ, జనసేన 'కూటమి'గా ఏర్పడే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. పవన్ గుజరాత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన గురువారం సాయంత్రం 6.20 గంటలకు అహ్మదాబాద్ చేరుకున్నారు. మోదీతో భేటీ సందర్భంగా రాజకీయాలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధిపై తనకున్న ఆలోచలను పవన్ పంచుకోనున్నారు. ఆయన మద్దతు కోరనున్నారు.
మరో ప్రక్క పవన్ కళ్యాణ్ రాజకీయ అభిప్రాయాలను కట్టడి చేయలేనని ఆయన సోదరుడు, కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. తమ్ముడిగా పవన్‌కు తన ఆశీస్సులు ఉంటాయని, రాజకీయంగా మాత్రమే తనకు ప్రత్యర్థి అని చెప్పారు. కాంగ్రెస్ను విమర్శించేవారంతా తమకు ప్రత్యర్థులే అన్నారు. సోదరుల్లో రాజకీయ భేదాభిప్రాయం తప్పేమీ కాదన్నారు. ఈ అంశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే చూడాలన్నారు. పవన్ కళ్యాణ్ తనను సవాల్ చేస్తే లక్షలాది మంది తమ్ముళ్లు తన వెనుక ఉన్నారని దీమా వ్యక్తం చేశారు. పవన్ లాంటి తమ్ముళ్లు తనకు లక్షలాది సంఖ్యలో ఉన్నారని చెప్పారు.


Click it and Unblock the Notifications











