అభినందన్‍ను టార్చర్ పెట్టొద్దు, పాకిస్థాన్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి: పవన్ కళ్యాణ్
పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు చనిపోవడం, ఆ తర్వాత పరిస్థితులు యుద్ద వాతావరణానికి దారి తీయడం, సరిహద్దులో ఉగ్రవాదం విచ్చలవిడిగా పెట్రేగిపోవడం, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో భాగంగా జరిగిన ఆపరేషన్లో మన వింగ్ కమాండర్ అభినందన్ విమానం కూలిపోయి పాకిస్థాన్ ఆర్మీకి చిక్కడం ఆందోళన కలిగించే విషయమని పవన్ కళ్యాణ్ అన్నారు.
యుద్ధం జరుగాలని ఎవరూ కోరుకోరు. అందరూ బావుండాలని కోరుకుంటాం. ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడ బంధీగా ఉండిపోవడం దేశ ప్రజలందరినీ కలవర పరుస్తోంది. ఆయన క్షేమంగా పాకిస్థాన్ నుంచి తిరిగి భారత దేశానికి తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. జనసేన తరుపున మేము కూడా మనస్పూర్తిగా కోరుకుంటున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

భారత ప్రభుత్వానికి అండగా ఉంటాం
ఇలాంటి సమయంలో తెలుగు ప్రజలందరి తరుపున, దక్షిణ భారత దేశ ప్రజలందరి తరుపున.. భారత ప్రభుత్వానికి, ప్రధాన మంత్రికి యుద్ధ సమయంలో మేమంతా అండగా ఉంటాం. ఇది దేశ సమస్య, ఒక పార్టీ సమస్య కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

టార్చర్ పెట్టొద్దు, యుద్ధం జరిగితే చాలా నష్టం
జెనీవా కన్వెన్స్ ప్రకారం యుద్ధ ఖైదీలను టార్చర్ చేయకుండా గౌరవంగా ట్రీట్ చేసి, యుద్ధ వాతావరణం అయిపోయిన తర్వాత క్షేమంగా వదిలిపెట్టాల్సిన బాధ్యత పాకిస్థాన్ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే యుద్ధం జరిగితే ఇరు వైపులా చాలా బలమైన నష్టాలు జరిగే అవకాశం ఉందన్నారు.

శుక్రవారం విడుదల కానున్న అభినందన్
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిడితో భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేసేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. శుక్రవారం ఆయనను రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా మీడియాకు తెలిపారు.

దేశ వ్యాప్తంగా ప్రార్థనలు
పాకిస్థాన్ సైన్యానికి చిక్కిన పైలట్ అభినందన్ క్షేమంగా భారత్ తిరిగి రావాలని దేశ వ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ద వాతావరణం, అభినందన్ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను దేశ ప్రజలు ఉత్కంఠగా పరిశీలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











