ఆంధ్రోడు అంటే బాధేసింది : పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తన కొత్త పార్టీ 'జన సేన' ఆవిర్భావ సభలో గతంలో తనకు ఎదురైన వివిధ అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా తాను సినిమాల్లో నటించే సమయంలో తెలంగాణ ప్రాంతంలో కొంత మంది వ్యక్తుల నుండి ఎదురైన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు.

ఆయన మాట్లాడుతూ....'తాను గతంలో పీఆర్పీ ఆఫీసులో ఉన్నపుడు 60 ఏళ్ల ఒక పెద్దాయన వచ్చారు. ఆంధ్ర నుండి మా ఆస్తులు దొబ్బేయడానికి వచ్చార్రా అని నన్ను తిట్టారు. అప్పుడు ఆయనపై నాకు కోపం రాలేదు. తర తరాలుగా తెలంగాణ ప్రాంతం పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం ఆయన్ను అలా మాట్లాడించింది. అందుకే నేను బాధ పడలేదు' అన్నారు.
తాను తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించానని, వారు తెలంగాణ ఎందుకు కోరుకుంటున్నారో నాకు తెలుసని, వారి బాధ నాకు తెలుసని, అందుకే వారు తిట్టినా నాకు బాధేయలేదని, ఎందుకంటే వారు తిట్టింది నన్ను కాదు....పరిస్థితులే వారిని అలా తిట్టించాయి అన్నారు.
ఎక్కడో దక్షిణామెరికా ఖండంలోని అర్జంటీనాకు చెందిన చెగెవెరా గురించి నా సినిమాలో పెడితే ఎవరూ ఏమనలేదు....మన తెలంగాణకు చెందని కొమురం భీం పేరు పెడితే నువ్వు ఆంధ్రోడివి కాబట్టి ఆయన పేరు నీ సినిమాలో వాడొద్దు అంటే బాధేసింది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఆంధ్ర, ప్రజల మధ్య విబేధాలు చెలరేగడానికి కారణం నీచమైన రాజకీయ నాయకులు, వారి రెచ్చగొట్టుడు ప్రసంగాల వల్లే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రెండు ప్రాంతాల నాయకులు ఎయిర్‌పోర్టులో కలుసుకుని కౌగిలించుకుంటారు....బయటకు వచ్చి ఇరు ప్రాంతాల వారిని రెచ్చగొడతారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మనం అంతా భారతీయులం అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











