ఏప్రిల్ 8 ఫిక్స్: రతన్‌పూర్ పోలీసుగా అలరించనున్న పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర (బాబీ)దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో పవన్ నటించి ‘గబ్బర్ సింగ్' భారీ విజయం సాధించడంతో మరోసారి ఆయన పోలీస్ గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రతన్‌పూర్ పోలీసుగా కనిపించబోతున్నారు. సంఘవిద్రోహ శక్తులకు, అవినీతి పరులకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న రతన్ పూర్ అంటే సామాన్యులతో పాటు పోలీసులు సైతం భయపడిపోతుంటారు. అలాంటి ఊర్లో పోలీసు ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన సర్దార్ గబ్బర్‌సింగ్ ఏం చేసాడు? వారిని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా కథ.
ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్‌మరార్, సునీల్ లుల్లా సంయుక్తంగా నిరిస్తున్నారు. తొలిసారిగా కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో తన దైన స్టైల్ లో అలరిస్తాడు. యాక్షన్, సెంటిమెంట్, వినోదంతో పాటు వాణిజ్య హంగులన్ని ఉంటాయి. పవన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయి. ప్రస్తుతం కేరళలో పవన్ కళ్యాణ్, ఇతరచిత్ర ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం, మరో మూడు రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తవుతుందని తెలిపారు.
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియోను మార్చిలో రిలీచేసి, ఏప్రిల్ 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. శరత్ ఖేల్కర్, ముఖేష్ రుషి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: అర్థర్ విల్సన్, ఎడిటింగ్: గౌతంరాజు, కళాదర్శకత్వం: బ్రహ్మ కడలి.


Click it and Unblock the Notifications











