ఆ కోరిక తీరకుండానే తారకరత్న మృతి చెందడం దురదృష్టకరం.. పవన్ కల్యాణ్, చిరంజీవి భావోద్వేగం
నందమూరి వంశ నట వారసుడు యువ హీరో తారకరత్న ఇకలేరు. జనవరి 27వ తేదీన గుండెపోటుకు గురైన ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతివార్తతో సినీ లోకం తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది.
బెంగళూరులో తుదిశ్వాస విడిచిన తారకరత్నను ఆదివారం ఉదయం హైదరాబాద్ నగర శివారులోని మోకిలాలోని తన నివాసానికి తరలిస్తారు. ఎల్లుండి ఉదయం అంటే.. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం చాంబర్‌లో ప్రజలు, అభిమానులు, సహచర నటీనటులు సందర్శనార్థం ఉంచుతామని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషాద సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌తోపాటు మరికొందరు సంతాపం తెలియజేస్తూ..
మరణవార్తతో తీవ్ర విషాదంలో
తారకరత్న మరణవార్తతో తీవ్ర విషాదంలో కూరుకుపోయాను. ప్రతిభావంతుడు, తేజస్సు, అప్యాయత కురిపించే ఆయన ఇకలేరంటే నమశక్యంగా లేదు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది. ఆయన మరణవార్త వినగానే గుండె ముక్కలైనంత పనైంది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని కోరుతూ... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకొంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు.

ఆ ఆశలు నెరవేరకుండానే
నటుడు శ్రీ నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. శ్రీ తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి శ్రీ మోహనకృష్ణ గారికి, బాబాయి శ్రీ బాలకృష్ణ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తారకరత్న మరణం
తారకరత్న మరణం నాకు తీవ్ర దిగ్బ్రాంతికి, విషాదానికి గురిచేసింది. నా సోదరుడు చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఊహించలేదు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు.
తారకరత్న తిరిగి రాని లోకాలకు
మృత్యువుతో పోరాటం చేస్తూ తారకరత్న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారనే వార్త నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. సహృదయుడైన ఆయన నా గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని రవితేజ ట్వీట్ చేశారు.
తారకరత్న ఇకలేరనే వార్త
నందమూరి తారకరత్న ఇకలేరనే వార్త విన్నడంతో నా హృదయం ముక్కలైంది. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని అనిల్ రావిపూడి అన్నారు.
తారకరత్న అన్న మరణించారనే వార్త
తారకరత్న అన్న మరణించారనే వార్త నా హృదయాన్ని గాయపరిచింది. ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళ్లాల్సిన అవసరం ఉందా? అనిపిస్తున్నది. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని సాయిధరమ్ తేజ్ సంతాపం తెలిపారు.


Click it and Unblock the Notifications











