అన్నయ్య కళాకారుడు.. నేను కాదు, రామ్ చరణ్‌ను వాడుకోను: తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్
Recommended Video

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'RRR' మూవీలో బిజీగా గడుపుతున్న సంగతి తలిసిందే. అయితే రెండు రోజుల క్రితం రామ్ చరణ్ జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా అతడి కాలికి మైనర్ ఇంజురీ అయింది. చీలమండలం (అంకిల్) గాయమైనట్లు, ఈ కారణంగా పూణె షెడ్యూల్ రద్దు చేసినట్లు, మూడు వారాలు రామ్ చరణ్ విశ్రాంతి తీసుకోనున్నారని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే రామ్ చరణ్ గాయపడటం, RRR షూటింగ్ రద్దు కావడంతో పలు పుకార్లు షికార్లు చేశాయి. షూటింగ్ రద్దయింది కాబట్టి రామ్ చరణ్ జనసేన ఎన్నికల ప్రచారంలో పాల్గొన బోతున్నారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అలాంటిదేమీ లేదని తేలిపోయింది.

యాక్టర్ల మీద ఆధారపడను
తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌కు సినిమా రంగానికి సంబంధించి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. సినిమా రంగంలో మీకు, మీ కుటుంబానికి ఒక స్టేటస్ ఉంది. మరి ఇండస్ట్రీ నుంచి ఎవరూ జనసేన పార్టీకి ప్రచారం చేయడానికి ఎందుకు రావడం లేదు? అని అడగ్గా... ‘వారు ఎందుకు రావడం లేదో నాకు తెలియదు, అయినా నేను యాక్టర్ల మీద ఆధారపడను, పొలిటికల్ ఐడియాలజీని నమ్ముకుంటాను' అని పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు.

రామ్ చరణ్ స్టార్ డమ్ వాడుకోను
రామ్ చరణ్ గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ బాబాయి అడిగితే తప్పకుండా వెళ్లి ప్రచారం చేస్తాను అన్నారు. మరి ఇప్పుడు రామ్ చరణ్ ప్రచారానికి వస్తారా? అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘నేను నా స్టార్ డమ్ వాడుకోను, స్టార్ డమ్ అనేది జనాలు రావడానికి తప్ప ప్రజలను చైతన్యం చేయడానికి పని చేయదు. అలాంటపుడు రామ్ చరణ్ స్టార్ డమ్ నేనెలా వాడుకుంటాను. నేను నా పొలిటికల్ ఐడియాలజీనే నమ్ముకుని ముందుకు సాగుతాను' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

అన్నయ్య చిరంజీవి రారు.. ఆయన కళాకారుడు, నేను కళాకారుడిని కాదు
‘‘జనసేన ప్రచారానికి అన్నయ్య చిరంజీవి రారు. ఆయన ఒక పొలిటికల్ కంక్లూజన్ తీసుకున్నారు. రాజకీయాలను నేను చూసే విధానం వేరు, ఆయన చూసే విధానం వేరు... ఈ విషయంలో మా ఇద్దరికీ స్పష్టత ఉంది. ఆయన కళాకారుడు. నేను కళాకారుడిని కాదు. అంతే తేడా...''అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

జపాన్ దేశంలో పర్యటిస్తున్న చిరంజీవి
కాగా.. ప్రస్తుతం చిరంజీవి తన పూర్తి ఫోకస్ సినిమాల మీదే పెట్టారు. మొన్నటి వరకు ‘సైనా నరసింహా రెడ్డి ' షూటింగులో గడిపిన ఆయన ప్రస్తుతం చిన్న విరామం తీసుకున్నారు. జపాన్ దేశంలో ఫ్యామిలీతో కలిసి పర్యటిస్తున్నారు.


Click it and Unblock the Notifications