ఓటమికి కుంగిపోకుండా విజయ్‌కాంత్ రాజకీయాల్లో ధైర్యంగా.. అవమానాలను ఎదురించి.. పవన్ కల్యాణ్ భావోద్వేగం
తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయ్‌కాంత్ మృతి వార్త సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన మరణ వార్త అందర్నీ తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆయన ఇక లేరనే వార్తతో చాలా మంది అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. ఆయన మృతికి సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. విజయ్‌కాంత్ మరణ వార్త వినగానే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సంతాపాన్ని ప్రకటిస్తూ..
Recommended Video

ప్రముఖ నటుడు విజయ్‌కాంత్ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమిళ సినిమా పరిశ్రమలో తనదైన స్థానాన్ని సొంతం చేసుకొన్న ఆయన తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆలరిచారు. కుటుంబ విలువలతోపాటు సామాజిక అంశాలను మేళవించి సినిమాల్లో నటించడమే కాకుండా యాక్షన్ చిత్రాల్లో కూడా నటించారు అని తన ప్రకటనలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

సామాజిక స్పృహ ఉన్న విజయ్‌కాంత్ డీఎండీకే పార్టీని స్థాపించారు. 2005 సంవత్సరంలో ఆయన పార్టీ ప్రకటించిన రోజు నేను మధురై ప్రాంతంలో షూటింగులో ఉన్నాను. ఆయన పట్ల అక్కడి ప్రజల ఆరాధ్యభావన, స్పందనను ప్రత్యక్షంగా చూశాను. ప్రజల పట్ల ఆయన స్పందించే తీరు.. సమస్యలపై ఆయన తెగించి పోరాడే తీరు, ప్రజలకు అండగా నిలిచే తీరు మెచ్చుకోదగినవి అని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఎల్లప్పుడూ విజయ్‌కాంత్ ప్రజలకు అండగా నిలిచేవారు. ఆపదలో ఉన్నారంటే మానవతా దృక్పథంతో ఆదుకొనే వారు. తొలి అడుగులో ఎదురైన ఫలితాన్ని చూసి అధైర్యపడకుండా రాజకీయాల్లో నిలబడటం ఆయన పోరాట పటిమను తెలియజేసింది. పరిస్థితులకు ఎదురొడ్డి సింహంలా నిలిచే వారు. ఆయనకు సినీ సహచరుల నుంచి అవమానాలు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు అని పవన్ కల్యాణ్ తన సంతాప ప్రకటనలో తెలిపారు.
ఎనో పోరాటాలు చేసి అవమానాలు తట్టుకొని తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్థాయికి ఎదగడమే కాకుండా ప్రజల పక్షాన నిలబడ్డారు. విజయ్‌కాంత్ గారిని చివరిసారిగా 2014లో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కలిశాను అని గుర్తు చేసుకొంటూ పవన్ కల్యాణ్ తన సంతాప ప్రకటనలో తెలియజేశారు.

తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగిన నాయకుడు అని ఎందరో భావించారు. ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. విజయ్‌కాంత్ మృతికి దిగ్బ్రాంతిని తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. రాజకీయ వారసత్వాన్ని ఆయన సతీమణి శ్రీమతి ప్రేమలత గారు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఆకాక్షించారు.


Click it and Unblock the Notifications











