ఎస్పీబాలు మరణం బాధాకరం.. కలిచివేసింది.. భావోద్వేగానికి గురైన పవన్ కల్యాణ్ (వీడియో)
దేశం గర్వించదగిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్త ప్రపంచ సినీ, సంగీత అభిమానులను కలిచివేసింది. ఆయన మరణంతో దేశవ్యాప్తంగా సంగీత ప్రియులు విషాదంలో మునిగిపోయారు. తనకు అప్తుడైన ఎస్పీ బాలు మరణ వార్త విని పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. పుట్టెడు దు:ఖంలో ఉన్న ఎస్పీ బాలు కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తూ...

కోవిడ్ నుంచి కోలుకొంటున్నారనే వార్తతో
ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్త మధ్యాహ్నం తెలియగానే తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. ఇటీవల ఆయన కోవిడ్-19 నుంచి కోలుకొంటున్నారనే వార్తతో సంతోషపడ్డాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అందరితోపాటు నేను ఆకాంక్షించాను. అన్ని సినీ పరిశ్రమలకు చెందిన ప్రతీ ఒక్కరు కోలుకోవాలని ప్రార్థించారు అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

బాధాకరం.. మనసు కలిచివేసింది..
ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగా ఉంది. కోలుకొంటున్నారనే వార్తలతో సంతోషంగా ఉండగానే ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం, దురదృష్టవశాత్తూ మన నుంచి దూరం కావడం చాలా బాధకరం. ఆయన కోవిడ్ బారిన పడి మరణించడం మనసును కలిచివేసింది అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నా సినిమాలకు కూడా పాటలు పాడారు..
సినిమాల విషయానికి వస్తే నేను నటించిన చిత్రాల్లో కూడా ఆయన తన గాత్రాన్ని అందించారు. ఆయన అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. చిన్నప్పటి నుంచి ఆయనను చూస్తూ, ఆయన పాటలు వింటూ పెరిగాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరణించడం చాలా బాధగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఎస్పీ బాలు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని పవన్ కల్యాణ్ గద్గద స్వరంతో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 25వ తేదీన తుదిశ్వాస
ఆగస్టు 5వ తేదీన కరోనావైరస్ పాజిటివ్ వ్యాధి గురై చెన్నైలోని ఎంజిఎం హాస్పిటల్‌లో చేరారు. ఆగస్టు 13వ తేదీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్ ద్వారా చికిత్సను అందించారు. రెండు రోజులు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకడం, తద్వారా జ్వరంతో బాధపడటం ఆయన ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేసింది. చికిత్స కొనసాగుతుండగానే శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.


Click it and Unblock the Notifications











