మెగాస్టార్ అందుకే అయ్యారు.. చిరంజీవి మావాడు అంటూ పవన్ కల్యాణ్ భావోద్వేగం
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన సోదరుడు, జనసేన అధినేత, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. తన అన్నయ్య, వదినపై ప్రేమ, గౌరవం గురించి వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి తనకు కేవలం అన్నయ్యే కాకుండా దైవంతో సమానమని వెల్లడిస్తూ జన్మదిన శుభాకాంక్షలు అందించారు. మెగాస్టార్ పుట్టిన రోజును పురస్కరించకొని పవన్ కల్యాణ్ సందేశాన్ని విడుదల చేశారు. పవర్ స్టార్ సందేశం ఆయన మాటల్లోనే..

నాకు స్పూర్తి ప్రదాత
అన్నయ్య చిరంజీవి గారు నా స్ఫూర్తి ప్రదాత. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను ఎంత ఆరాధిస్తానో నా అన్నయ్య చిరంజీవిని కూడా అంతలా పూజ్య భావంతో ప్రేమిస్తాను. నా అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం. అన్నయ్య చేతిపట్టుకొని పెరిగాను. ఒక విధంగా చెప్పాలంటే అన్నయ్యే నా తొలి గురువు. అమ్మలా లాలించారు. నాన్నలా మార్గదర్శిగా నిలిచారు అంటూ పవన్ కల్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు.

కోట్లాది మంది అభిమానులు గుండెల్లో
కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటలు అన్నయ్యను చూస్తే నిజమనిపిస్తాయి. సినిమా పరిశ్రమలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ప్రవేశించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరణమైన స్థానాన్ని సంపాదించారు. తెలుగువారు సగర్వంగా "చిరంజీవి మావాడు" అని చెప్పుకొనేలా తనను తాను మలచుకున్నారు అని పవన్ కల్యాణ్ తన జన్మదిన సందేశంలో పేర్కొన్నారు.

సాధారణ స్థితి నుంచి అసామాన్యుడిగా ఎదిగి..
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి, నాలాంటివారు ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. కష్టాన్ని నమ్ముకున్నారు. సముచిత స్థానానికి చేరుకున్నారు. చిన్న పాయగా ఉద్భవించే నది అఖండ రూపాన్ని సంతరించుకున్నట్లు చిరంజీవి గారు సినిమా పరిశ్రమలో మెగాస్టార్‌గా ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణాన్ని అలవరుచుకున్నారు. ఆయన ఎదుగుదల ఆయనలోని సేవా తత్పరతను ఆవిష్కరింపచేసింది అని అన్నయ్య చిరంజీవిపై పవన్ ప్రేమను వ్యక్తం చేశారు.

ఎందరో నటులకు స్పూర్తి
చిరంజీవి తనకే కాదు.. ఎందరికో స్ఫూర్తి అంటూ పవన్ కల్యాణ్ వెల్లడిస్తూ.. ఆయనలా నటుడవుదామని, ఆయనలా అభినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే, ఆయనలా సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారు. తన అభిమానులకు 'సేవ' అనే సత్కార్యానికి దారి చూపారు. ఎందరో ఆ దారిలో పయనిస్తూ నేడు సమాజంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆపన్నులకు అండగా వుంటున్నారు అని అన్నారు.
Recommended Video

చిరాయువతో కలకాలం జీవించాలని
సేవ, పట్టుదలకు మారుపేరుగా నిలిచిన చిరంజీవి లాంటి కృషీవలునికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. కోట్లాది మందికి అభిమానాపాత్రుడైన చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా ఆయనను తెలుగు వారందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చిరంజీవి గారికి చిరాయువుతో కూడిన సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్నయ్యకు ప్రేమపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని తన సందేశంలో పవన్ కల్యాణ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











