ప్రకృతి ఉద్యమానికి సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకృతి ఉద్యమానికి రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమిటి? ప్రకృతి ఉద్యమం ఏమిటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే. పవన్ కళ్యాణ్ వృత్తి సినిమాల్లో నటించడం అయితే...ఆయన ప్రవృత్తుల్లో వ్యవసాయం ఒకటి. ఏ మాత్ర సమయం దొరికినా హైదరాబాద్ సమీపంలో ఆయన ఫార్మ్ హౌస్ లో గడపడటం ఆయనకు అలవాటు. అక్కడ రకరకాల పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో రసాయనాలతో కూడిన వ్యవసాయమే ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రకృతి ఉద్యమాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. విజయరామ్ అనే వ్యక్తితో కలిసి ఆయన ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. రసాయన సేద్యాన్ని విడిచి ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించడానికి విజయరామ్ తో కలిసి పవన్ కళ్యాణ్ తన వంతు సహాయం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను విజయరామ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రకృతి ప్రేమికుడు అనే విషయం తెలుసుకున్న విజయ్ రామ్....ఆయనకు లేఖ రాసారు. వెంటనే పవన్ ఆయన్ను పిలిచి అపాయింట్ మెంట్ ఇచ్చారు. రెండున్నర గంటల పాటు విజయ్ రామ్ చెప్పింది విన్నారు. ప్రకృతి ఉద్యమానికి మీ మాట సాయం కావాలని విజయ్ రామ్ కోరగా హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెబుతానని మాట ఇచ్చారు.
అంతే కాకుండా విజయరామ్ సహకారంతో తన ఎనిమిది ఎకరాల సొంత వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల ఆకు కూరలు, పండ్లు, పూల మొక్కల సాగు ప్రారంభించారు పవన్ కళ్యాణ్. రసాయనాల అవసరం లేని గోఆధారిత సాగు వ్యవసాయం దగ్గరుండి పరిశీలించారు పవన్ కళ్యాణ్. పంట పండిన తర్వాత ఆ రుచులను పవన్ కళ్యాణ్ ఎంతగానో ఆస్వాదించారట. ఈ పద్దతిలో పండిన ఆకుకూరలు చిన్న తనంలో నాయనమ్మ వండిపెట్టినపుడు ఎంత రుచిగా ఉన్నాయో అంతే రుచిగా ఉన్నాయని పవన్ తెలిపారని విజయరామ్ అన్నారు. ప్రస్తుతం గోపాల గోపాల షూటింగులో ఉన్న పవన్ త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో తన అనుభవాలు, అభిప్రాయాలు వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications