దారుణం: ఫ్యాన్ పైనే పవన్ ఫ్యాన్స్ దాడి, అర్థనగ్నంగా మార్చి చితకబాదారు..
Recommended Video

అభిమాన హీరోలు ఇప్పటి యువతరానికి దేవుళ్లు. కాదంటే.. వాళ్లసలు ఒప్పుకోరు. వాళ్ల ఆరాధ్య హీరోకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా.. జన్మలో మళ్లీ ఆ పేరెత్తకుండా చేయగలరు. బయటి వ్యక్తులే కాదు.. ఒకవేళ అభిమానులే వ్యతిరేక కామెంట్స్ చేసినా.. వాళ్లకూ మూడినట్లే. తాజాగా పవన్ కల్యాణ్ అభిమానులు సాటి పవన్ అభిమానిపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఎందుకీ దాడి?:
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి'చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సినిమాను పవన్ ఒప్పుకోవడం అభిమానులకు కూడా రుచించలేదు.
అందుకే చాలామంది అభిమానులు సైతం బాహాటంగానే పవన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఓ పవన్ అభిమాని కూడా పవన్ పై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కాడు.

ఆ 'వీడియో' వల్లే..:
'అజ్ఞాతవాసి' సినిమాపై తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఓ అభిమాని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియోలో పవన్ కల్యాణ్ పోస్టర్‌ను చెప్పుతో కొడుతున్నట్లు కనిపిస్తోంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ అభిమానుల కంటపడింది.

'జై పవనిజం' అంటూ చితకబాదారు..:
తమ అభిమాన హీరోను మరో అభిమాని ఇంతలా కించపర్చడంతో వారు తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యారు. సదరు అభిమాని చిరునామా వెతికి మరీ అతన్ని పట్టుకున్నారు. 'జై పవనిజం' అన్న నినాదాలు చేస్తూ అతన్ని చితకబాదారు.

అర్థనగ్నంగా తిప్పుతూ దాడి..:
అతని చొక్కా విప్పేసి అర్థనగ్నంగా తిప్పుతూ చితకబాదారు. పవన్ పోస్టర్ వద్దకు తీసుకొచ్చి మోకాళ్లపై కూర్చోబెట్టి ఫోటోకు మొక్కమంటూ పిడిగుద్దులు కురిపించారు. దీంతో బాధితుడు పవన్ పోస్టర్‌కు మొక్కుతూ తనను విడిచిపెట్టాల్సిందిగా వేడుకున్నాడు. అయినా అభిమానులు అతన్ని వదలకుండా దాడి చేయడం గమనార్హం.

ఫ్యాన్స్ హెచ్చరిక:
బాధితుడిని చెప్పలేని రీతిలో బూతులు తిట్టిన పవన్ ఫ్యాన్స్.. భవిష్యత్తులో తమ అభిమాన హీరోను ఎవరైనా ఏమైనా అంటే వారికి ఇదే తరహా శిక్ష పడుతుందని హెచ్చరించారు. పవన్ ఫ్యాన్స్ దాడికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











