వైష్ణవ్ తేజ్ ఎంట్రీపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు: ‘ఉప్పెన’ చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఇదే
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మెగా ఫ్యామిలీ కొంత ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమే. అంతేకాదు, వాళ్లలో చాలా మంది టాలీవుడ్‌లోనే స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కుర్రాడు కూడా సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. అతడే.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' అనే మూవీ ద్వారా హీరోగా పరిచయం అవుతోన్న అతడిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే, సినిమా గురించీ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ వివరాలు మీకోసం!

చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. అప్పుడే అదరగొట్టాడు
చిన్న వయసులోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' నటించి మెప్పించాడు పంజా వైష్ణవ్ తేజ్. కదలకుండా కుర్చీలో కూర్చుని ఉంటూ.. కళ్లతోనే హవభావాలు పలికించే పాత్రలో అతడు ఒదిగిపోయాడు. ఆ తర్వాత 'జానీ' సహా పలు చిత్రాల్లో మెరిశాడు. దీంతో అతడు హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, అది చాలా ఆలస్యం అయింది.

ఉప్పెనతో హీరోగా.. గ్రాండ్‌గా లాంఛ్ అవుతూ
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన 'ఉప్పెన'తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రలో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. ఇది ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతుంది.

అంచనాలు పెరిగాయి.. ప్రీ బిజినెస్ భారీగానే
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఉప్పెన షూటింగ్ ఎప్పుడో పూర్తయినా.. లాక్‌డౌన్ కారణంగా విడుదల బాగా ఆలస్యం అయింది. ఈ గ్యాప్‌లో విడుదలైన ఇందులోని 'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే, టీజర్, ఇటీవల వచ్చిన ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

అల్లుడిని ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవి
తన మేనల్లుడు హీరోగా పరిచయం అవుతోన్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కథ ఎంపిక దగ్గర నుంచి అన్నీ స్వయంగా చూసుకున్నారు. అంతేకాదు, అందరి కంటే ముందే సినిమాను చూశారు. అందుకే 'ఉప్పెన' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆయన కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో తన మేనల్లుడిని ఆశీర్వదించిన ఆయన చిత్ర యూనిట్‌కు విసెష్ చెప్పారు.

‘ఉప్పెన' చూసిన తర్వాత పవన్ రియాక్షన్
'ఉప్పెన' మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు, నిర్మాత రవిలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలిసి 'ఉప్పెన' ట్రైలర్ చూపించారు. ఇది చూసిన పవన్.. 'మన నేటివిటీని కళ్ల ముందుంచే సినిమాలు ఎప్పటికీ మధురానుభూతులుగా నిలుస్తాయి. అందులో ఉప్పెన కూడా ఒకటని అనిపిస్తుంది' అంటూ చెప్పుకొచ్చారాయన.

రంగస్థలం, దంగల్ తర్వాత ఉప్పెననే అంటూ
సినిమా గురించి పవన్ మాట్లాడుతూ.. 'ఎమోషన్స్‌తో సాగే 'దంగల్', 'రంగస్థలం' ఎక్కువ కాలం గుర్తుండిపోయే చిత్రాలు. ఎమోషనల్ కథలు అందరికీ కనెక్ట్ అవుతాయి. 'ఉప్పెన' కూడా ఆ కోవలోకే వస్తుందని అనిపిస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు అంత గొప్పగా తీశాడని తెలుస్తోంది. ఈ సినిమా తీసిన నిర్మాతలకు, టెక్నికల్ సిబ్బందికి నా బెస్ట్ విసెష్' అంటూ పేర్కొన్నారాయన.

వైష్ణవ్ తేజ్ ఎంట్రీపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి చెబుతూ.. 'వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కోసం మంచి పాత్రను ఎంచుకున్నాడు. సవాల్‌తో కూడుకున్న ఈ పాత్రతో ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. ఇది అందరికీ గుర్తిండిపోయే పాత్ర అవుతుందనడంలో సందేహం లేదు. వాడు చిన్నప్పుడే 'జానీ'లో అద్భుతంగా నటించాడు. ఇప్పుడు హీరోగానూ సక్సెస్ అవుతాడు' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











