Telangana Election Results: తెలంగాణలో కనిపించని పవన్ కల్యాణ్ ప్రభావం.. ఎక్కడెక్కడ డిపాజిట్లు గల్లంతంటే?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం వైపు దూసుకెళ్తున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను కైవసం చేసుకోనే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రతిష్టాత్మకంగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌తో సహా పలువురు మంత్రులు ఓటమిపాలై గడ్డి కరిచారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన దారుణ పరాజయం పొందింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ప్రభావంపై భారీ చర్చ జరుగుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జనసేన పార్టీ ప్రభావం శూన్యంగా కనిపించింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కలుపుకొని 8 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఎనిమిది స్థానాల్లో కూకట్ పల్లిలో తప్ప ఎక్కడా ప్రభావం చూపలేకపోయిందనే తాజా ఫలితాలను బట్టి స్పష్టమైంది.

అయితే జనసేన పార్టీ దారుణమైన ప్రదర్శనకు ప్రధాన కారణం.. ఆ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో బీజేపీకి స్థానిక బలం లేని ప్రాంతాలే. అంతేకాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అత్యంత బలం ఉన్న ప్రాంతాలను పవన్ కల్యాణ్ ఎంచుకొని భారీ సాహసం చేశారనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
జనసేన పార్టీ పోటీ చేసిన స్థానాల విషయానికి వస్తే.. కూకట్‌పల్లి, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావు పేట, కోదాడ, తాండూర్ ప్రాంతాల్లో పోటీ చేసింది. ఈ స్థానాల్లో అధినేతన పవన్ కల్యాణ్ ప్రచారం కూడా చేశారు. అయితే ఎన్నికల ముందు అభ్యర్థులు తమ విజయావకాశాలపై గెలుపు ధీమా వ్యక్తం చేశారు.

అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం కూకట్‌పల్లి తప్ప ఎక్కడా అంతగా ప్రభావం చూపలేకపోయింది. కూకట్ పల్లిలో జనసేన మూడో స్థానంలో, నాగర్ కర్నూల్ 6వ స్థానం, ఖమ్మంలో 6వ స్థానం, కొత్తగూడెంలో 8 స్థానంలో, వైరాలో 4వ స్థానంలో, అశ్వారావుపేటలో 6వ స్థానంలో, కోదాడలో 8వ స్థానంలో, తాండూర్‌లో 4వ స్థానంలో నిలిచింది. దాదాపు పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్స్ కోల్పోయింది.


Click it and Unblock the Notifications











