పోస్టర్ చూసి సినిమా కొన్నాడు.. ఆయనకు ఆ సెన్స్ ఉంది.. దిల్ రాజుపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన గత జీవితాన్ని, సినిమాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. తొలి ప్రేమ సినిమా సమయంలో దిల్ రాజు చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. ఆ సమయంలో ఆయన చేసిన సాహసాన్ని పవన్ కొనియాడారు. ఇంతకు పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే...

గుంటూరు శేషేంద్ర శర్మ పలుకులు
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కవి గుంటూరు శేషేంద్రశర్మ మాటలను చెబుతూ.. కలల కను.. కలలు కను.. కలలు కను.. నీ కలలను తొక్కుతూ నడుస్తున్న పాదాలను ఖండించేంత వరకు కలలు కను అని అన్నారు. తొలిప్రేమ సినిమా చేసేటప్పుడు పోస్టర్ చూసి సినిమా కొంటానని ముందుకు వచ్చారనే విషయాన్ని పవన్ కల్యాణ్ తెలిపారు.

తొలి ప్రేమ సినిమా సమయంలో
తొలి ప్రేమ సినిమా ప్రారంభం కాకముందే సినిమాను కొంటానని దిల్ రాజు ముందుకొచ్చారనే విషయాన్ని నిర్మాత రాజు గారు చెప్పారు. ఈయనేంటి సినిమా మొదలు కాకముందే కొంటానని వచ్చారని అనుకొన్నాను. కానీ విజయం ఎక్కడుంతో పసిగట్టే సెన్స్ ఉందనే గ్రహించాను. సినిమా అంటే విపరీతమైన వ్యామోహం ఉందనే విషయం నాకు తెలిసింది అని పవన్ కల్యాణ్ అన్నారు.

నాకు తెలిసిన వకీల్ సాబ్‌లు ఎవరంటే
వకీల్ సాబ్ చిత్రంలో నటించడానికి కంటే ముందే నాకు తెలిసిన మొదటి లాయర్ నాని ఫాల్కివాలా. ఎమర్జెన్సీ సమయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ప్రజల కోసం బలంగా వాదించిన వ్యక్తి ఆయన. అలాగే చుండూరులో దళితుల ఊచకోత జరిగినప్పుడు వారి కోసం వాదించిన గొప్ప లాయర్ బోనగిరి చంద్రశేఖర్ గారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ బాధితుల కోసం పోరాడారు. బాలగోపాల్ లాంటి లాయర్ల నుంచి స్పూర్తి పొందుతాను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

నాగబాబు కారణంగానే న్యాయవాద వృత్తిపై
న్యాయవాద వృత్తిపై అభిమానం, గౌరవం పెరగడానికి కారణం మా అన్నయ్య నాగబాబు. ఆయన లా పుస్తకాలు చదువుతుంటే.. వాటి గురించి చెబుతుంటే న్యాయవాద వృత్తితో ఇలా కూడా చేయవచ్చా అనే విషయం తెలిసింది. నాని ఫాల్కివాలా, బోనగిరి చంద్రశేఖర్ లాంటి వాళ్లు నాకు స్పూర్తిగా నిలిచారు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











