‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్
హైదరాబాద్: తెలుగులో ఘన విజయం సాధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం తమిళ నిర్మాతలను ఊరిస్తోంది. ఈచిత్రాన్ని రీమేక్ చేయడానికి పలువురు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. తెలుగులో వచ్చిన ఒక్కడు, పోకిరి, అతనొక్కడే, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాల తమిళ రీమేక్‌లో నటించిన విజయ్‌ని పెట్టి 'అత్తారింటికి దారేది' చిత్రం రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం....'పలువురు తమిళ నిర్మాతలు అత్తారింటికి దారేది చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి ఇంట్రెస్టు చూపుతున్న మాట వాస్తవమే, కానీ ఇప్పటి వరకు ఎవరూ రీమేక్ రైట్స్ కొనుగోలు చేయలేదు. త్వరలోనే ఈ విషయమై ఓక్లారిటీ వచ్చే అవకాశం ఉంది' అని అంటున్నారు.
సెప్టెంబర్ 27న విడుదలైన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇప్పటి వరకు రూ. 50 కోట్ల వరకు వసూలు చేసింది. త్వరలోనే ఈచిత్రం రూ. 100 కోట్లను అందుకుంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా దెబ్బకు గత తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు.
ఫ్యామిలీ, యూత్, క్లాస్, మాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రం ఉండటం సినిమాకు బాగా ప్లస్సయింది. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












