ఫ్యాన్స్...పవన్ పార్టీపై మీ అభిప్రాయమేంటి? (కామెంట్ ప్లీజ్)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాలీవుడ్లో టాప్ స్టార్. ఆయన వ్యక్తిత్వం ఎలాంటితో అందరికీ తెలిసిందే. మీడియాకు వీలైనంత దూరంగా ఉండే పవన్ కళ్యాణ్....ఈ సారి కావాలని మీడియాకు చేతి నిండా పనికల్పించారు. మార్చి రెండో వారంలో రాజకీయాలపై తన అభిప్రాయాన్నీ, పార్టీ స్థాపించే విషయం గురించి, ఎన్నికలలో పోటీ చేసే విషయం గురించి స్వయంగా వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది.
పవన్ నుండి ఎలాంటి ప్రకటన లేకుండానే....ఆయనపై మీడియాలో ఊహాజనిత వార్తలు జోరుగా సాగుతుంటాయి. స్వయాన పవర్ కళ్యాణ్ ఆఫీసు నుండి ప్రకటన వెలువడటంతో మీడియాకు చేతి నిండా పని దొరికినట్లయింది. దీంతో పవన్ కళ్యాణ్ గురించి ఇబ్బడి ముబ్బడిగా కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని, ఆ పార్టీ పేరు 'రిపబ్లికన్ పార్టీ', 'యువరాజ్యం' అనే పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం సైతం జోరుగుగా సాగుతోంది. మార్చి 9న లేదా, మార్చి 11న ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

పార్టీ పెట్టే విషయంపై పవన్ సన్నిహిత మిత్రులతో, భావసారూప్యం గల వ్యక్తులతో చర్చలు జరుపుతున్నారని, పార్టీ పేరును ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేయించడానికి ఓ బృందాన్ని ఢిల్లీకి పంపేందుకు కూడా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారని, విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఎక్కడ విన్నా పవన్‌కళ్యాణ్ ఏదన్నా పార్టీలో చేరబోతున్నారా లేక ఏ పార్టికైనా మద్దతు ఇవ్వబోతున్నారా అనే చర్చలే. రెండో వారంలో ఆయన స్పష్టంగా ప్రకటన చేస్తానని చెప్పటంతో మీడియాలో రకరకాల ప్రచారాలు తారా స్ధాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో .. లోక్‌సత్తా పార్టీలో చేరాలంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఆహ్వానించారు.
''నేటి సమాజంలో చాలామంది రాజకీయాన్ని వ్యాపారంగా, అధికారమార్గంగా చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. రాజకీయాన్ని పవిత్రమైన పనిగా, సమాజాన్ని మార్చే సాధనంగా, కోట్లాదిమంది బతుకుల్ని మార్చే అవకాశంగా భావించేవారు అవసరం. సమాజం బాగుండాలని తపనపడే మంచి మనసున్న వ్యక్తి పవన్‌కళ్యాణ్. ఆయనకు లక్షలమంది అభిమానులున్నారు. అలాంటివ్యక్తి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి, నాయకత్వ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఆయన్ను మనసారా ఆహ్వానిస్తున్నాం. లోక్‌సత్తాను వేదికగా చేసుకోండి'' అంటూ పవన్‌కళ్యాణ్‌ను జేపీ ఆహ్వానించారు.
ఫ్యాన్స్....ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఒక వేళ వస్తే ఆయన ఈ రాజకీయాల్లో ఇమడగలుగుతారా? ఆయన కొత్త రాజకీయ పార్టీ పెడితే బెటరా? లేక లోక్ సత్తా లాంటి పార్టీల్లో చేరడం సరైన చర్యా? అభిమానులుగా మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్సులో తెలియ జేయండి.


Click it and Unblock the Notifications











