ఆ డబ్బు ఏం చేసావ్? కవితపై పవన్ కళ్యాణ్ ఫైర్
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కూతురు కవిత....ఇటీవల పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెడుతున్న నేపథ్యంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన 'జన సేన' పార్టీ ఆవిర్భావ సభలో పవణ్ ఎదురు విమర్శ చేసారు. 'నేను ప్రేమించే నా తెలంగాణకు క్షమాపణ చెప్పాలని అడగటానికి మీరెవరు?' అని ఆవేశంగా ప్రశ్నించారు.
కవిత గారు...మీరు నాకు చెల్లలు లాంటి వారు, తెలంగాణ జాగృతి పేరుతో చాలా డబ్బలు వసూలు చేసారు, ఆ డబ్బు దేనికి ఖర్చు చేసారో లెక్క చెప్పాలని తెలంగాణ ప్రజా సంఘాల నాయకులు కొందరు నా వద్దకు వచ్చి అడిగారు...లెక్కలు చెప్పడానికి రెడీగా ఉండమ్మా' అని సూచించారు.

ప్రజారాజ్యం పార్టీతో సామాజిక తెలంగాణ అని చిరంజీవి తెలంగాణ ప్రజలను మోసం చేశారని, సామాజిక తెలంగాణ అని ఆ తర్వాత జై సమైక్యాంధ్ర అన్నారని ఇటీవల కవిత విమర్శించారు. ఇప్పుడు ఏముఖం పెట్టుకుని తమ్ముడు వస్తున్నాడని కవిత ఇటీవల ప్రశ్నించారు. పీఆర్పీ తప్పిదాలకు ముందుగా క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ ప్రజాజీవితంలోకి రావాలన్నారు. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
అన్నయ్య చిరంజీవి తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడని, ఆయన్ను ఎదురించడానికి తాను పార్టీ పెట్టడం లేదన్నారు. తాను అన్నయ్యకు ఎదురు వెళ్లడం లేదని, ఈ నీచమైన, దుర్మార్గమైన రాజకీయాలకు మాత్రమే తాను ఎదురు వెలుతున్నానని తెలిపారు. తాను పార్టీ పెడుతున్నట్లు ఎవరికీ చెప్పలేదని, నా కుటుంబ సభ్యులకు నాలుగు రోజుల క్రితమే మీడియా ద్వారా ఈ విషయం తెలిసిందన్నారు పవన్ కల్యాణ్.
తాను పిరికి వాడిని కాదని, బాంచన్ కాల్మొక్తా దొర అనే రకం కాదని, చావనైనా చస్తాను కానీ వెన్ను చూపను అన్నారు. రేపు నన్ను చంపినా చంపేస్తారు. ప్రాణం, కుటుంబం, పిల్లల కంటే సమాజం, దేశం ముఖ్యం అనికొనే రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. సమాజం శ్రేయస్సు కోసమే పార్టీ పెడుతున్నట్లు స్పష్టం చేసారు.


Click it and Unblock the Notifications











