రికార్డులు బ్రేక్ చేసిన ‘వకీల్ సాబ్’: ఎన్టీఆర్ తర్వాతి స్థానంలో పవన్ కల్యాణ్.. అది బ్రేక్ అవుతుందా!
పేరుకు తెలుగు హీరోనే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా... ఎంతో శ్రమపడి సొంతంగా ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడాయన. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయిపోయిన ఆయన... కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన పవన్... త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ న్యూ మూవీ టీజర్ విడుదలైంది. అది కొన్ని రికార్డులను ట్రేక్ చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

ఆఫ్టర్ గ్యాప్... పవర్ స్టార్ ఈజ్ బ్యాక్
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' తర్వాత రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ సమయంలో ఇకపై సినిమాలు చేయనని తేల్చి చెప్పాడు. దీంతో ఆయన అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ముఖానికి మేకప్ వేసుకోడానికి సిద్ధం అయ్యాడు ఈ మెగా హీరో.

వకీల్ సాబ్‌గా ఎంట్రీ ఇస్తున్న పవన్
'వకీల్ సాబ్' అనే మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన 'పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య హీరోయిన్లుగా చేస్తున్న ఈ మూవీలో పవన్ లాయర్‌గా కనిపించనున్నాడు.

భారీ స్పందన.. అంచనాలు రెట్టింపు
పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో 'వకీల్ సాబ్'పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ మధ్య విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, మగువా మగువా సాంగ్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. వీటితో పాటు పవర్ స్టార్ పుట్టినరోజుకు వచ్చిన మోషన్ పోస్టర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

సంక్రాంతి రోజు ‘వకీల్ సాబ్’ కానుక
సంక్రాంతి పండగను పురస్కరించుకుని 'వకీల్ సాబ్' సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. ముందుగానే ప్రకటించినట్లుగా సరిగ్గా జనవరి 14 సాయంత్రం 6.03 గంటలకు ఇది విడుదలైంది. అంతకు ముందు నుంచే ఈ టీజర్ కోసం ట్విట్టర్‌లో ట్రెండ్ సెట్ చేశారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ పేరు మారుమ్రోగిపోయింది. ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.

విశేష స్పందన.. రికార్డులు బద్దలు
ఎన్నో రోజులుగా ఆకలి మీదున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ 'వకీల్ సాబ్' టీజర్‌కు విశేషమైన స్పందనను అందిస్తున్నారు. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వేగంగా మిలియన్ వ్యూస్ అందుకున్న టీజర్లలో రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు RRR నుంచి ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' వీడియో మొదటి స్థానంలో ఉంది.

అందులోనూ రెండో స్థానంలో పవన్
దూసుకుపోతోన్న 'వకీల్ సాబ్' టీజర్ ఇప్పటకే ఏడు మిలియన్ల పైచిలుకు వ్యూస్ అందుకుంది. అలాగే, ఏడు లక్షలకు పైగా లైకులు కూడా సాధించింది. తద్వారా 'రామరాజు ఫర్ భీం' తర్వాత వేగంగా యాభై వేలు, లక్ష, రెండు లక్షలు, మూడు లక్షలు, ఐదు లక్షలు, ఏడు లక్షలు లైకులు అందుకున్న టీజర్‌గా ఇది నిలిచింది. దీంతో 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ మూడుకు పడిపోయింది.


Click it and Unblock the Notifications











