అలీకి పదవి దక్కలేదేమో.. పొగిడేవాళ్ళని నమ్మను, పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత పవన్ తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నాడు. ఏపీ రాజకీయాల్లో సినీ గ్లామర్ ఎక్కువగా కనిపిస్తోంది. దీనితో పవన్ కళ్యాణ్ జనసేనపై సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఇటీవల ఇంటర్వ్యూలో జనసేన పార్టీకి మెగా హీరోల ప్రచారం, తన స్నేహితుడు అలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాబాయి కోసం
గతంలో ఓ సందర్భంలో రాంచరణ్ జనసేన పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చాయి. బాబాయ్ కోరుకుంటే తప్పకుండా జనసేనకు ప్రచారం చేస్తానని రాంచరణ్ ఓ సందర్భంలో తెలిపాడు. కానీ బాబాయ్ ని ఇబ్బంది పెట్టేలా నేనే చొరవ తీసుకోను అని చరణ్ అప్పట్లో అన్నాడు. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో మెగా ఫ్యామిలీ హీరోలు జనసేన తరుపున ప్రచారం నిర్వహిస్తారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

అవగాహన ఉండాలి
రాంచరణ్ వ్యాఖ్యలపై ఈ ఇంటర్వ్యూలో పవన్ స్పందించారు. హీరోలు వచ్చి ప్రచారం చేస్తే జనాలు చూడడానికి వస్తారు. కానీ వారిని ప్రసంగాలతో మెప్పించగలిగే అవగాహన ఉండాలి. పలు విషయాలపై పూర్తి అవగాహనతో మాట్లాడితేనే ఆ ప్రచారానికి అర్థం ఉంటుంది అని పవన్ తెలిపారు. తాను మెగా హీరోలెవరిని ప్రచారానికి ఆహ్వానించలేదని పవన్ పరోక్షంగా తెలియజేశారు.

అలీకి పదవి దక్కలేదేమో
తనకు అత్యంత సన్నిహితుడు, మంచి మిత్రుడు అయిన అలీ వైసిపిలో చేరడంపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించాడు. అలీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. బహుశా అలికి టీడీపీలో పదవి దక్కలేదేమో. అందుకే వైసీపీలో చేరి ఉంటారు. అయినా అలీ ఏపార్టీలో చేరాలన్నది ఆయన నిర్ణయం. అలీకి ఆ ఛాయిస్ ఉంది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలీ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరాలని భావించినప్పడు పవన్ ని కూడా కలిసిన సంగతి తెలిసిందే.

పొగిడేవాళ్ళని నమ్మను
అలీపై వ్యాఖ్యలని కొనసాగిస్తూ.. సినిమాల్లో స్టార్ హీరోగా ఉన్నప్పుడు చాలా మంది నన్ను పొగుడుతుంటారు, చప్పట్లు కొడుతుంటారు. అలా పొగిడేవాళ్ళందరిని నేను నమ్మను. ఎవరు ఏంటనే విషయం నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తల్లో నేను ఉంటా అని పవన్ కాస్త సంచలనమైన వ్యాఖ్యలే చేశాడు. అలీ ప్రస్తుతం వైసిపి నేతగా కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications











