విదేశీ ఉత్పత్తులను బహిష్కరించండి..గణపతికి ‘స్వదేశీ’ పూజలే అంటూ పవన్ కల్యాణ్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అభిమానులను, జనసైనికులను, తెలుగు రాష్ట్రాల ప్రజలను గణేష్ పండుగ ఉత్సవాల కోసం సిద్ధం చేస్తున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు అందించారు. పండుగ జరుపుకొనే క్రమంలో స్వదేశీ మంత్రాన్ని పఠించాలని ఆయన సూచించారు. ఈ మేరకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ..
Recommended Video

కరోనా విఘ్నం నుంచి కాపాడాలని
హిందువులకు తొలి పండుగ వినాయక చతుర్థి. ఏ పని తలపెట్టినా విఘ్నాలు కలుగకుండా చూడమని వినాయకుడిని వేడుకుంటాం. కరోనా అనే ఈ భయంకర విఘ్నం నుంచి దేశ ప్రజలందరినీ కాపాడమని ముందుగా ఆ విఘ్ననాయకుడ్ని ప్రార్ధిస్తున్నాను. కులమతాలకు అతీతంగా భారతీయులందరూ జరుపుకునే పండుగ మన వినాయకచవితి. ఒక విధంగా చెప్పాలంటే మన దేశ సమైక్యతకు, దేశ భక్తికి ప్రతీక ఈ పండుగ అని పవన్ కల్యాణ్ అన్నారు.

విదేశీ వస్తువులను బహిష్కరించండి
ఈ ఏడాది మన దేశభక్తిని ఈ పండుగలో ప్రతిబింబింప చేద్దాం. మనకు తెలియకుండానే విదేశీ వస్తువులు మన జీవనంలో భాగమైపోతున్నాయి. మన కార్మికులు శ్రమించి రూపొందించిన వస్తువులకు మార్కెట్ లేకుండా పోతోంది. మన వినాయక పూజలో సైతం విదేశీ పూజాద్రవ్యాలు సింహ భాగం కనిపిస్తున్నాయి. ఈ పూజ నుంచి అయినా మనం విదేశీ వస్తువులను త్యజిద్దాం అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

దేశభక్తికి గణపతి పండుగ ప్రతీక
దేశభక్తికి, సమైకత్య ప్రతిరూపమైన పండుగ కోసం మన నేలపైన తయారైన వస్తువులనే వాడదాం. తద్వారా మన దేశ ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధికి దోహదపడదాం. మన గడ్డపై భారతీయ సమాజం ఉత్పత్తి చేసిన పర్యావరణ హితమైన పూజాద్రవ్యాలతోనే ఈ పండుగ జరుపుకొందాం. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, తెలుగువారందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున వినాయకచవితి శుభాకాంక్షలు అని పవన్ కల్యాణ్ తెలిపారు.

సినీ, రాజకీయాలతో బిజీగా
పవన్ కల్యాణ్ విషయానికి వస్తే. పార్టీ కార్యక్రమాలు, సినిమాలతో బిజీగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఆయన వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగులు వాయిదా పడటంతో ప్రస్తుతం సినిమాలకు సంబంధించి కథలపై దృష్టిపెట్టారు. వకీల్ సాబ్‌తోపాటు క్రిష్, తదితర దర్శకులు రూపొందించే చిత్రాలపై కసరత్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











