క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గమ్యం, వేదం లాంటి సృజనాత్మక సినిమాలు రూపొందించిన క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో పవర్ స్టార్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇటీవల అతడు పవన్ కళ్యాణ్‌ని కలిశాడని సమాచారం. అయితే ఈ కలయిక వెనక సినిమా చేయాలనే ఆలోచన ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, క్రిష్ వారి వారి సినిమా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. అవి పూర్తయిన తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం ద్వారా పవర్ స్టార్ ఓ సందేశాత్మక అంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ంరలో పవర్ స్టార్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా దర్శనం ఇవ్వబోతున్నాడు. పవన్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
క్రిష్ ప్రస్తుతం రాణా హీరోగా 'కృష్ణం వందే జగద్దురమ్' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఒక డిఫరెంట్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు కెరీర్లో సరైన హిట్ లేని రాణా క్రిష్ దర్శకత్వంపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











