మాస్ ఎంటర్టైనర్ (‘అత్తారింటికి దారేది' ప్రివ్యూ)
రకరకాల కారణాలతో వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్న అత్తారింటికి దారేది చిత్రం...పైరసీ ఎఫెక్ట్ తో ముందు అనుకున్న తేదీకి ముందుగానే అంటే ఈ రోజే థియోటర్స్ లోకి దిగుతోంది. దాదాపు 55 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం త్రివిక్రమ్ తరహా పంచ్ లతో, పవన్ పవర్ ఫెరఫార్మెన్స్ తో అదరకొడుతుందనే నమ్మకం టీజర్ విడుదల అయిననాటి నుంచీ అందరిలో వ్యక్తమవుతోంది.
గౌతమ్ నందా (పవన్ కల్యాణ్) ఆరడుగుల బుల్లెట్‌లాంటోడు. దూసుకెళ్లడం మాత్రమే తెలిసిన వ్యక్తి. అపర కుబేరుడు. తాతయ్య (బొమన్ ఇరానీ)కి ఇచ్చిన మాట కోసం.. ఇండియా వస్తాడు. ఇక్కడ తన పేరు సిద్దార్థ్‌గా మార్చుకొంటాడు. ఓ సాధారణ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడు? ఎందుకు? అనేది తెరపైనే చూడాలి. సునంద (నదియా), శశి (సమంత) పాత్రలూ కీలకమే.
నిర్మాత మాట్లాడుతూ ''జల్సా తరవాత పవన్ -త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న చిత్రమిది. అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు. దానికి తగినట్టుగానే సినిమాని రూపొందించాం. పవన్ పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు తప్పకుండా ఆకట్టుకొంటాయి. దేవిశ్రీ అందించిన బాణీలకు మంచి స్పందన వచ్చింది. అనివార్య కారణాల వల్ల అనుకొన్న సమయానికంటే ముందే ఈ సినిమాని తీసుకొస్తున్నాం. బుధవారం రాత్రి నుంచి ముందస్తు బుకింగ్ ప్రారంభించాం. ఇరవై నాలుగు గంటల్లో వారం రోజుల టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. దాంతో మా నమ్మకం మరింత పెరిగింది''అన్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.
నటీనటులు:పవన్ కళ్యాణ్, ప్రణీత, సమంత, నదియా , కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయ,బొమన్ ఇరాని, ముఖేష్ రుషి, శ్రీనివాస రెడ్డి, తదితరులు సంగీతం : దేవిశ్రీ ప్రసాద్,
ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల,
ఫైట్స్ : పీటర్ హెయిన్స్,
ఆర్ట్ : రవీందర్,
కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్,
నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్,
రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.
విడుదల: 27,సెప్టెంబర్, 2013.


Click it and Unblock the Notifications












