పవన్ కళ్యాణ్... ప్లాపు చిత్రం గ్రాండ్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పరమ ప్లాపు చిత్రం 'పంజా' తమిళ వెర్షన్‌ను తమిళనాట గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత నీలిమ తిరుమల శెట్టి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేస్తామని ట్వీట్ చేశారు.
పంజా చిత్రాన్ని తమిళంలో 'కురి' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విష్ణువర్ధన్‌కు తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాలను స్టయిలిష్‌గా తెరకెక్కిస్తాడనే మంచి పేరుంది. గతంలో ఆయన దర్శకత్వం వహించిన 'బిల్లా' చిత్రం తమిళనాట భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 'పంజా' తమిళ వెర్షన్ 'కురి'పై అక్కడ మంచి అంచనాలే ఉన్నాయి.
వాస్తవానికి 'పంజా' చిత్రం స్టయిలిష్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. అయితే సినిమాలోని కొన్ని అంశాలు తెలుగు ప్రేక్షకులకు నచ్చక పోవడం, పవర్ స్టార్ నుంచి ఆశించిన ఎంటర్ టైన్మెంట్ దక్కక పోవడంతో పంజాను తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. అయితే తమిళనాడులో పరిస్థితి వేరు. తమిళ ప్రేక్షకుల అభిరుచి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ కారణం వల్ల ఎంతో కొంత కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.
పంజా చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సారా జాన్ డియాస్, అంజలి లవానియాలు హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డలు సంయుక్తంగా నిర్మించారు. మరి ఈచిత్రం తమిళనాట ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











