పెళ్ళాం పిచ్చోడు ఎప్పుడు?
రాజేంద్రప్రసాద్ పెళ్ళాం పిచ్చోడు సినిమాకు ఏమైంది? ఆడియో విడుదలై మూడు నెలలు గడిచినా ఆ సినిమా ఎందుకు విడుదల కావడం లేదు? హీరో రాజేంద్రప్రసాద్, దర్శకుడు జొన్నవిత్తుల తన కొంప ముంచారని ఆ సినిమా నిర్మాత శ్రీనివాస్ ఇటీవలే ప్రారంభమైన ఒక సినిమా సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. తమ సినిమా కంటే ముందు అందగాడు సినిమా విడుదల కావాలని అనుకున్న రాజేంద్రప్రసాద్ డేట్స్ మార్చుకుని ఆలస్యానికి కారణమయ్యారని ఆయన వాపోయారు. అందగాడు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆ ప్రభావం పెళ్ళాం పిచ్చోడు మీద పడి బయ్యర్లు వెనకాడారని నిర్మాత చెప్పారు.
రాజేంద్రప్రసాద్, జొన్నవిత్తుల ఇగోకు తాను బలయ్యానని ఆయన వెల్లడించారు. కోట్లు వెచ్చించి సినిమా తీసే నిర్మాత బాధలు వారికి అర్ధం కావని శ్రీనివాస్ అన్నారు. మరో విశేషమేమిటంటే ఈ సినిమాకు సంగీత దర్శకత్వం కూడా రాజేంద్రప్రసాద్ వహించినట్టు ప్రచారం జరిగింది. ఆడియో కేసెట్‌ల మీద కూడా సంగీత దర్శకుడిగా ఆయన పేరు ఉంది. నిజానికి రాజేంద్రప్రసాద్ సంగీత సమకూర్చలేదని, కొందరు మహానుభావులు సంగీతం అందించారని శ్రీనివాస్ చెప్పారు. చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, కొద్ది రోజుల్లో సినిమా విడుదల అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











