వారి ఆత్మహత్యలకు గవర్నర్, రాష్ట్రపతిదే బాధ్యత.. ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు
సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను ఆధారంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించే నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి రూపొందించిన తాజా చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. గ్రూప్ పరీక్షల పేపర్ లీక్ అంశాన్ని చేసుకొన్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్బంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ...
పరీక్ష పేపర్లు లీక్ చేసి చూసి రాసి పాస్ అవుతుంటే.. కష్టపడి పరీక్ష రాసిన వారి పరిస్థితి చాలా దారుణంగా మారుతున్నది. పేపర్ లీక్ చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తూ.. దానికి బాధ్యతులైన వారికి కఠిన శిక్ష విధించాలి. అలాంటి పాయింట్‌తోనే యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాను రూపొందించాను అని నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు.
కాలేజీ, విశ్వవిద్యాలయంలో చదివిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఆ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకొంటున్నారు. పిల్లలు మంచి ఉద్యోగం సంపాదిస్తారని కోచింగ్ కోసం తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేస్తున్నారు. కోచింగ్ సెంటర్లలో చాలా మంది కష్టపడి చదువుతుంటారు. అలాంటి నిరుద్యోగులకు పేపర్ లీక్ ద్వారా అన్యాయం జరుగుతున్నది తెలిపారు.
తల్లిదండ్రులు అప్పు చేసి పిల్లల బాగోగుల కోసం డబ్బు ఖర్చు చేస్తుంటే.. పిల్లలు తల్లిదండ్రులను ఆదుకోవడానికి కష్టపడి చదువుతుంటే.. అడ్డ దారిలో పేపర్ లీక్ చేస్తూ కొందరు పాస్ అయిపోతున్నారు. ఇలాంటి వ్యవస్థకు అర్ధం ఉందా? ఎన్ని పరీక్షలు ఎన్నిసార్లు రాస్తారు? ఓ మ్యాచ్‌లో సచిన్ సెంచరీ కొట్టిన తర్వాత ఆ మ్యాచ్ రద్దైతే.. మర్నాడు జరిగే పరీక్షలో సెంచరీ కొడుతారా? డక్ అవుట్ కావొచ్చు. విద్యార్థుల పరిస్థితి కూడా అలానే ఉంటుంది అని ఆర్ నారాయణ మూర్తి ఆవేదన చెందారు.

పేపర్ లీక్ కారణంగా ఎంతో మంది నిరుద్యోగులు నిరాశకు గురి అవుతున్నారు. కొందరు నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అలాంటి వారు నిరాశకు గురికావొద్దని బలంగా చెప్పే సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్. ఈ గ్రూప్ పరీక్షలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో జరుగుతున్న అక్రమాలకు గవర్నర్, ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత వహించాలి అని ఆర్ నారాయణ మూర్తి డిమాండ్ చేశారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే.. స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ. చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాలి. మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కామ్ జరిగితే.. ఇండియా మొత్తం సంచలనం రేపింది. అక్రమాలకు పాల్పడిన చాలా మంది ఆఫీసర్లను చంపేశారు. ఈ సమస్యను జాతి సమస్యగా భావించి.. రాష్ట్రపతి ముర్ము వెంటనే ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశ పరిచి తగిన చర్యలను తీసుకోవాలి. విద్యా వ్యవస్థను రక్షించాలి అని ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











