టాక్సీవాలాని గీత ఆర్ట్స్ వాళ్ళు తగలబెట్టేస్తారు.. ఇదొక గుణపాఠం, విజయ్ దేవరకొండ రెండోసారి!
Recommended Video

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. చాలా రోజులపాటు వాయిదా పడుతూ వచ్చిన టాక్సీవాలా చిత్రం ఎట్టకేలకు నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే టాక్సీవాలా చిత్రానికి పాజిటివ్ టాక్ సొంతమైంది. ఈ చిత్ర విజయం, పైరసీకి గురికావడం లాంటి అంశాలపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ చేసేవాళ్లకు టాక్సీవాలా చిత్రం గుణపాఠం అని అన్నారు.

తగలబెట్టేస్తారు అంటూ
విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రంతో మళ్ళీ హిట్ కొట్టాడు. ఈ చిత్రం విడుదల కాకముందు అనేక పుకార్లు వినిపించాయి. సినిమా సరిగా రాలేదు అని, గీతా ఆర్ట్స్ వాళ్ళు అసలు ఈ చిత్రాన్ని విడుదల చేయడంలేదు, ప్రింట్ ని తగలబెట్టేస్తున్నారు అంటూ ఏవేవో పుకార్లు వినిపించాయని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అలాంటి చిత్రం ఇప్పుడు విడుదలై పెద్ద హిట్ గా నిలిచిందని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు.

మూడు నెలల ముందు
మూడు నెలల ముందు టాక్సీవాలా చిత్రాన్ని పైరసీ చేసి లీక్ చేశారు. అయినా కూడా సినిమా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారని తమ్మారెడ్డి అన్నారు. దీనిని బట్టి సినిమా బావుంటే ప్రజలు ఆదరిస్తారు అని అర్థం అవుతోంది. ఎవరో కొందరు కామెంట్ చేసినంత మాత్రాన, పైరసీ చేసినంత మాత్రాన సినిమాకు వచ్చిన నష్టం లేదు అని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు.

సినిమాని చంపేశాం
టాక్సీవాలా చిత్రాన్ని పైరసీ చేసి చంపేశాం అని సంబరపడేవాళ్ళకు ఇది గుణపాఠం. ఎన్ని చేసినా సినిమాలో దమ్ము ఉంటే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మంచి చిత్రాన్ని ప్రజలు థియేటర్స్ లోనే చూడాలని అనుకుంటారు. సినిమా బాగాలేకపోతే కనీసం పైరసీలో కూడా చూడరని తమ్మారెడ్డి తెలిపారు.

ఒకే ఏడాదిలో రెండు
ఇక టాక్సీవాలా చిత్రం విజయం సాధించినందుకు విజయ్ దేవరకొండకు, గీత ఆర్ట్స్ కి శుభాకాంక్షలు. ఒకే ఏడాది వీరిద్దరి కాంబినేషన్లో గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయని తమ్మారెడ్డి అన్నారు. మంచి సినిమాని పైరసీ చేసినా పెద్దగా నష్టం ఉండదు. కాబట్టి పైరసీ చేసేవాళ్ళు సమయం వృధా చేసుకోకండి అని తమ్మారెడ్డి హితవు పలికారు.


Click it and Unblock the Notifications











