బెంగూళూర్ లో ‘మగధీర’ నకిలీ డీవీడీలు
ఇటీవల విడుదలై భారీ కలెక్షన్లు సాధిస్తున్న మగధీర తెలుగు చిత్రం నకిలీ డివీడిలను విక్రయిస్తున్న ముఠాను బెంగుళూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సినిమావే కాకుండా లక్, లవ్ ఆజ్ కల్ హిందీ చిత్రాల నకిలి డీవీడీలను కూడా ఈ ముఠా తయారు చేసి విక్రయిస్తోంది. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సినిమాలు నిర్మించిన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్ల కళ్లు కప్పి వీరు లక్షల సంఖ్యలో నకిలీ డీవీడీలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని పోలీసులు చెప్పారు. కొత్తగా విడుదలైన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల చలన చిత్రాల నకిలీ డీవీడీలు విక్రయించి లక్షలు దోచుకుంటున్నారని పోలీసులు తెలిపారు. కలాసిపాళ్య పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కలాసిపాళ్య మెయిన్ రోడ్డులోని కేఎం రోడ్డులోని గోడౌన్లో నకిలి డీవీడీలు తయారు చేసి సీడీ షాప్ లలో విక్రయిస్తున్నారని సీసీబీ పోలీసులకు సమాచారం అందడంతో డీవీడీలు కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు నటించి ఏకకాలంలో గోడౌన్, సీడీ షాప్ లపై దాడి జరిపారు. ఫైరోజ్ పాష, ఇనామతుల్లా, షేక్ అహ్మద్, అమానుల్లా ఖాన్, బంగారి, రవి, ప్రవీణ్ కుమార్ అనే నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుండి రూ.15 లక్షలు విలువైన 12,575 నకిలీ డీవీడీలు, ఎంపఅ-3లు స్వాధీనం చేసుకున్నామని సీసీబీ డీసీపీ సిద్ధరామయ్య తెలిపారు.


Click it and Unblock the Notifications











