AP Elections లోకేష్‌ని చూసి నేర్చుకో జూ. ఎన్టీఆర్ .. సినిమాలు ఆపేసి రా, నేనే పదవి ఇప్పిస్తా.. టీడీపీ నేత
ఎవరు ఔనన్నా కాదన్నా ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కువగా వినిపించింది. ఆయనను ఓన్ చేసుకునేందుకు వైసీపీ, టీడీపీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎన్టీఆర్ అభిమానులు, సన్నిహితులు ఉండటంతో ప్రచార సభలు, ర్యాలీలలో జూనియర్ ఫ్లెక్సీలు, జెండాలు హల్‌చల్ చేశాయి. ఇక తెలుగుదేశం పార్టీ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి కుటుంబం టీడీపీ ప్రాపర్టీ అని అందరూ అంగీకరించే మాట. దీంతో ఎప్పటిలాగానే ఎన్టీఆర్ నామస్మరణ జరిగింది.
నిజానికి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తన దూకుడుతో టీడీపీని కకావికలం చేశారు. తెలుగుదేశానికి కీలక నేతలుగా ఉన్న వారిని టార్గెట్ చేసి వెంటాడటంతో పాటు పార్టీ ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టారు. మరోసారి జగన్ కనుక అధికారంలోకి వస్తే టీడీపీ ఉనికే ప్రమాదంలో పడుతుందని చంద్రబాబు గ్రహించారు. అందుకే నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించిన ఆయన ఏడు పదుల వయసులోనూ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో, కొన్ని ప్రాంతాల్లో పార్టీకి నష్టం కలిగే పరిస్ధితులు ఉన్నా జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలను ఎదుర్కొన్నారు.

కానీ తాత పెట్టిన పార్టీకి ఎప్పుడూ తన మద్ధతు ఉంటుందని చెప్పే ఎన్టీఆర్.. ఈ ఎన్నికల్లో ప్రచారానికి రాకపోయినా కనీసం చిన్న ట్వీట్ కూడా చేయకపోవడం చర్చనీయాంశమైంది. కమ్మ సామాజికవర్గంతో పాటు తెలుగుదేశం వీరాభిమానులు ఈ విషయంలో బాగా డిజప్పాయింట్ అయి జూనియర్ తీరును తప్పుబట్టారు.
కూటమిలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం అతని కుటుంబ సభ్యులు, చిత్ర పరిశ్రమలోని అభిమానులు ఎంతో శ్రమించారు. కానీ టీడీపీ విషయంలో ఎన్టీఆర్ కానీ అతని సోదరుడు కళ్యాణ్ రామ్ గానీ మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. తోటీ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు తమ సన్నిహితులకు సంఘీభావం తెలపడం కూడా ఎన్టీఆర్‌పై విమర్శలకు కారణమైంది.

జూనియర్ తీరుపై భగ్గుమన్న కొందరు తెలుగుదేశం నేతలు .. అసలు ఎన్టీఆర్‌కు, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అలాగే చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు నారా లోకేష్‌కే అప్పగించాలని డిమాండ్ చేయడం రాజకీయాల్లో చర్చకు కారణమైంది. కానీ టీడీపీలోని ఒక వర్గం మాత్రం చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తేనే పార్టీ బతుకుతుందని చెబుతున్నారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, వాక్చాతుర్యం, సబ్జెక్ట్‌పై పట్టు అన్నింటికి మించి అచ్చుగుద్దినట్లు తాత పోలిక తదితర అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి.
తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే , టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ సైతం జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. టీడీపీలోకి ఎన్టీఆర్ రావొచ్చన్నారు. కానీ సినిమాలు మానేసి ఫుల్ టైమ్ వస్తే.. పార్టీలో ఏదో ఒక పదవి ఇచ్చి కూర్చోబెడతామని వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్, ఎన్టీఆర్‌ల సామర్ధ్యంపై కొందరు పోలిక పెడుతున్నారన్న ఆయన .. లోకేష్ పార్టీ కోసం సిన్సియర్‌గా కష్టపడుతున్నారని ప్రశంసించారు.
లోకేష్ నాయకత్వంలో 60 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయని.. పార్టీలోకి టెక్నాలజీని తీసుకొచ్చారని, కార్యకర్తలు మరణిస్తే ఇన్సూరెన్స్ ద్వారా సాయం చేసే విధానాన్ని తీసుకొచ్చారని వర్మ చెప్పారు. ఎవరైనా పనిచేస్తేనే గుర్తింపు వస్తుందని.. అంతేకానీ ఇంట్లో కూర్చొని నేనేదో చేసుకుంటాను, పదవి ఇవ్వమంటే ఎలా ఇస్తారని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ కోసం త్యాగం చేసి రావాలని, అప్పుడు తానే పదవి ఇప్పిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలని నందమూరి కుటుంబ సభ్యులకు ఉండాలని.. వారికి లేని బాధ మిగిలినవాళ్లకు ఎందుకని వర్మ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











