Elections 2024: పవన్ కల్యాణ్‌కు భారీ విజయం.. పిఠాపురంలో మెజారిటీ ఎంతో చెప్పేసిన వంగా గీత.. వీడియో వైరల్
ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణం. ఆయన గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసి పరాజయం కావడంతో .. ఈసారి కూడా ఆ సెగ్మెంట్ల నుంచే బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా వ్యూహం మార్చారు. ఎవ్వరూ ఊహించని విధంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు. కాపు సామాజికవర్గంతో పాటు బీసీలు, తన అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పవన్ ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు.
దీంతో ఆయనను ఓడించేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వంగా గీతను బరిలో దించింది. ఆమెకు అన్ని రకాలుగా అండదండలు అందించారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్. మంత్రులు, పార్టీ నేతలు వంగా గీత తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా మెగా హీరోలు రంగంలోకి దిగారు. నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిథరమ్ తేజ్‌లు ప్రచారం నిర్వహించగా.. జబర్దస్త్ నటులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, బుల్లితెర నటుడు ఆర్కే సాగర్ తదితరులు ఇంటింటికి తిరిగారు.

దీంతో వీఐపీ సెగ్మెంట్లయిన కుప్పం, పులివెందుల, హిందూపురం, మంగళగిరి కాదని జనం, మీడియా అందరి దృష్టి పిఠాపురంపై పడింది. పోలింగ్ రోజు కూడా ఈ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఓటింగ్ సాగింది. ఏకంగా 86.63 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ వెల్లడించింది. ఇక్కడ 2014లో 79.44 శాతం, 2019లో 80.92 శాతంగా నమోదైనట్లు చెప్పింది.
ఇందుకు పవన్ కళ్యాణే కారణమనే కామెంట్స్ వినిపించాయి. యువత, విద్యార్ధులు, ఉద్యోగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు భారీగా క్యూకట్టారు. విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న పిఠాపురం వాసులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి స్వస్థలానికి చేరుకుని ఓటు వేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో గెలుపెవరిది అంటూ కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది. ఈసారి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా పవన్ నిలుస్తారని జనసేన కేడర్ ధీమాగా ఉంది.

ఈ నేపథ్యంలో వైసీపీ నేత, పిఠాపురం అభ్యర్ధి వంగా గీత మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పవన్‌పై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. ఆయనొక సెలబ్రెటీ అని, ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని చెబుతూ పవన్ కోసం అందరూ వచ్చి ప్రచారం చేశారని గీత అన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు 80 వేల నుంచి 90 వేల మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని పవన్ , జనసేన అభిమానులు షేర్ చేస్తూ వైసీపీపై కామెంట్స్ పెడుతున్నారు. వంగా గీత చేతులెత్తేశారని, ఆ పార్టీ నేతలు తూర్పు తిరిగి దండం పెట్టుకోండి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనికి వైసీపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌కు 80 నుంచి 90 వేల ఓట్లు మాత్రమే వస్తాయని వంగా గీత చెప్పారు తప్పించి అది మెజారిటీ కాదన్నారు. ఇటీవల ఫేక్ వీడియోలు, ఆడియోలు చక్కర్లు కొడుతున్న క్రమంలో వంగా గీత ఆడియో నిజమా లేక ఫేకా అన్నది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











