పవన్ కల్యాణ్, చిరంజీవి అనుబంధం.. ప్రధాని మోడీని అభిమానిగా మార్చిన వేళ!
ఉత్కంఠగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు నేటితో తెరపడింది. చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు. ఆ వెంటనే డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ''కొణిదెల పవన్ కళ్యాణ్ '' అనే మాట ఆయన నోటి వెంట రాగానే సభా ప్రాంగణం దద్ధరిల్లిపోయింది. పవన్ వేదికపై ఉన్నంత సేపు అభిమానులు, కూటమి కార్యకర్తలు ఈలలు, కేరింతలు చేశారు. చంద్రబాబు, పవన్‌లతో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తన అన్నయ్య చిరంజీవిపై ప్రేమను , గౌరవాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్. మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు , రజనీకాంత్ , చిరంజీవి సహా ఇతర పెద్దలకు నమస్కరిస్తూ వెళ్లిన పవన్ తిరిగి వస్తూ.. తన అన్నయ్య వద్ద ఆగి ఆయన పాదాలపై పడ్డారు. కింద ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న చిరంజీవి సతీమణి సురేఖ, ఆయన తనయుడు రాంచరణ్ ఈ దృశ్యం చూసి భావోద్వేగానికి గురయ్యారు.

అంతేకాదు.. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ దగ్గరకి వెళ్లిన పవన్ కళ్యాణ్ .. చిరంజీవి వైపు చూపెడుతూ చెవిలో ఏదో చెప్పారు. తర్వాత మోడీని తీసుకుని తన అన్నయ్య వద్దకు వెళ్లి పరిచయం చేశారు. అనంతరం మోడీ.. చిరు, పవన్‌ల చేతులు పట్టుకుని మరీ వేదిక మధ్యలోకి తీసుకొచ్చారు. తర్వాత ముగ్గురూ చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం మెగా బ్రదర్స్ ఇద్దరినీ దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో చిరంజీవి ఉద్వేగానికి గురయ్యారు. పవన్ బుగ్గలు నిమురుతూ ఆప్యాయత చూపారు. వేదిక కింద నుంచి తన తండ్రి, బాబాయ్‌లను మోడీ పక్కన చూసి రామ్‌చరణ్ సైతం ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే మూవ్‌మెంట్ అంటూ ఓ ఎక్స్ యూజర్ రాసుకొచ్చాడు. జనసేన పార్టీ అయితే '' ఇది తెలుగు రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్భుత ఘట్టంగా పేర్కొంది. చిత్రసీమలో ఎందరో దిగ్గజాలకు సైతం స్పూర్తిగా నిలిచిన చిరంజీవి, రాజకీయాల్లో మార్పు రావాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ ఎంతోమంది యువతకు ప్రేరణగా నిలిచిన పవన్ కళ్యాణ్, ప్రపంచ దేశాలు భారతదేశంవైపు చూసేలా, "మేరా భారత్ మహాన్" అని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలా భారత దేశాన్ని తీర్చిదిద్దిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు చేయి చేయి కలుపుతూ ఒకే వేదిక పై కనువిందు చేసిన అద్భుత దృశ్యం '' అంటూ పేర్కొంది.
ఇప్పుడే కాదు.. తన అన్నయ్య చిరంజీవి పట్ల పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కృతజ్ఞత చూపిస్తూనే ఉంటారు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం మెగాస్టారేనని ఎన్నో వేదికలపై చెప్పారు పవన్ . ఎన్నికల్లో ఘన విజయం సాధించి, పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పవన్ కళ్యాణ్ తన భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. అప్పుడు కూడా అన్నయ్యకి పాదాభివందనం చేశారు పవన్. ఈ దృశ్యం చూసి పక్కనేవున్న నాగబాబు కన్నీటిపర్యంతమయ్యారు. అలాగే తన వదిన సురేఖ, తల్లి అంజనా దేవికి పాదాభివందనం చేశారు. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన పెద్దన్నయ్య ఆశీస్సులు తీసుకోవడంతో ఈ అన్నదమ్ములపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


Click it and Unblock the Notifications











