‘1-నేనొక్కడినే’ ఆడియోకు పోలీసుల ఆంక్షలు
హైదరాబాద్: మహేష్ బాబు నటించిన '1-నేనొక్కడినే' ఆడియో వేడుక ఈ రోజు గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు నిర్వాహకులను ముందస్తుగా హెచ్చరించారు. ఆడియో వేడుకపై పలు ఆంక్షలు విధించారు. గతంలో ఎన్టీఆర్ 'బాద్ షా' ఆడియో వేడుక సందర్భంగా తొక్కిసలాట జరిగి ఒక అభిమాని మృతి చెందిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇలాంటి సినిమా వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు.
ఆడిటోరియం పరిమితికి మించి పాసులు జారీచేయకూడదని.....పోలీసుల భద్రత ఉన్నప్పటికీ ప్రైవేటు సెక్యూరిటీ కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆడియో పాసులపై ప్రత్యేకంగా హోలోగ్రాం గుర్తుతో పాటు, పోలీసుల స్టాంపు కూడా ఉంటుందని తెలుస్తోంది. డూప్లికేట్ పాసులకు అవకాశం లేకుండా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.
'1-నేనొక్కడినే' ఆడియో వేడుక తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూలేని విధంగా వినూత్నంగా నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఈచిత్రం ఆడియోను ఎంపిక చేసిన థియేటర్లలో లైవ్ షో ఏర్పాటు చేసారు. థియేటర్లలో చూడాలనుకునే వారికి ఒక్కో టిక్కెట్ ధరను రూ. 250గా నిర్ణయించారు. టిక్కెట్ తో పాటు సినిమా లోగోలతో కూడిన టీ షర్టు, క్యాప్, కీచన్ అందిస్తున్నారు.
మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా కావడం, ఇటీవల విడుదలైన టీజర్ అదిరిపోయే విధంగా ఉండటం, వినూత్నమైన ప్రచారంతో నిర్మాతలు ముందుకు సాగుతుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. సినిమా విడుదల తర్వాత కూడా ఇదే రకమైన రెస్పాన్స్ ఉంటుందని, సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లను సాధిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.
'1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications












