సీతమ్మ గొంతు కోసినట్లు చూపిస్తారా.. బీజేపీ అవమానించింది.. ఆదిపురుష్‌పై రాజకీయ నేతల ఫైర్
రామాయణం ఆధారంగా రూపొందిన ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. శ్రీరాముడిగా ప్రభాస్ అలరించిన ఈ సినిమాలో పది తలల రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతాదేవిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్, హనుమంతుడిగా మరాఠీ పాపులర్ నటుడు దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 16న విడుదల కాగా విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా రాజకీయ నేతలు ఆదిపురుష్ సినిమాపై ఫైర్ అవుతున్నారు.
జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆదిపురుష్ సినిమాకు ఎంత భారీగా కలెక్షన్స్ వస్తున్నాయో.. అదే రేంజ్ లో నెగెటివిటీ కూడా వస్తోంది. కేవలం సినిమాలోని గ్రాఫిక్స్ పరంగానే కాకుండా సన్నివేశాలు, డైలాగ్స్ పై చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. రావణుడిని చూపించిన విధానంపై కూడా విమర్శలు భారీగానే వస్తున్నాయి. బీజేపీ పని గట్టుకుని ప్రమోట్ చేసిన ఆదిపురుష్ మూవీ మనోభావాలను దెబ్బ తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నేతలు.

"ఎంతో బాధతో కన్నీళ్లు వస్తున్నాయి. బీజేపీ తమ రాజకీయాల కోసం సీతారాములను దారుణంగా అవమానించింది. సీతారాములు, హనుమంతుడి పేరు వింటేనే హిందువులంతా తలొంచి నమస్కరిస్తారు. భక్తి భావం ఉప్పొంగుతుంది. అలాంటి దేవుళ్లపై ఎంతో దారుణమైన సినిమా తీశారు. సంభాషణలు కూడా అభ్యంతరంగా ఉన్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. ఇంద్రజిత్తుడు సీతమ్మ గొంతు కోసినట్లు చూపించారు. ఇదంతా ఫిక్షన్ మాత్రమే. ఏవేవో ఊహించుకుని రామ్ చరిత్ మానస్ ను కూడా మార్చేస్తారా?" అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దుయ్యబట్టారు.
"పుష్కర్ ధామి, నరోత్తమ్ మిశ్రా, యోగి ఆదిత్య నాథ్, శివరాజ్ సింగ్ చౌహన్, ఏక్ నాథ్ షిండే.. ఇలా ఎంతో మంది బీజేపీ నేతలు ఈ సినిమాను ప్రోత్సహించారు. కానీ సినిమాలో మాత్రం వీధుల్లో మాట్లాడుకునే భాషను వాడారు. సీతారాములు, హనుమంతుడిపై ఇలాంటి సినిమా తీయించి బీజేపీ దారుణంగా అవమానించింది" అని సంజయ్ సింగ్ అన్నారు. ఉద్ధవ్ థాక్రే, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఆదిపురుష్ సినిమాపై విమర్శలు గుప్పించారు.
"ఆదిపురుష్ డైలాగ్ రైటర్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ముఖ్యంగా హనుమంతుడికి అలాంటి డైలాగ్స్ పెట్టడం సరికాదు. భారతీయుల మనోభావాలు దెబ్బ తీశాయి. ఎంటర్టైన్ మెంట్ పేరుతో దేవుళ్లకు అలాంటి డైలాగ్స్ పెడతారా. మర్యాదపురుషోత్తమ్ రాముడి సినిమా తీసి ఆ మర్యాదనే మర్చిపోయారు" అని ప్రియాంక సింగ్ చతుర్వేది తెలిపారు.


Click it and Unblock the Notifications











