వైసీపీ ప్రభుత్వ హయంలో విచ్చలవిడిగా దోపిడి: మురళీ మోహన్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికల్లో ఏపీలో సినీతారలు తమ ప్రభావం చూపేందుకు సిద్దమవుతున్నారు. పవన్ కల్యాణ్, నాగబాబు జనసేన తరఫున ప్రచారానికి సిద్దమవుతుండగా.. హైపర్ ఆది, జానీ మాస్టర్, నిహారిక కొణిదల తదితరులు తమ వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక తెలుగు దేశం పార్టీ తరఫున నిర్మాత, నటుడు మురళీ మోహన్ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టారు. ఆయన తాజాగా మాట్లాడుతూ..
తెలుగు దేశం పార్టీ ఆవిర్బావం నుంచి మురళీ మోహన్ కీలకంగా వ్యవహరిస్తన్నారు. ఆయన టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి పోటీ చేయడం తెలిసిందే. అంతేకాకుండా పార్టీకి అండగా ఉంటూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రభావ వంతమైన పాత్రను పోషించారు. తాజాగా ఏపీ ఎన్నికల సమరం మొదలు కావడంతో మరోసారి టీడీపీ తరఫున తమ ప్రచారాన్ని చేసేందుకు రెడీ అవుతున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ మురళీమోహన్ అధికార ప్రభుతంపై నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకత్వంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దాంతో రాష్ట్రం ఐదేళ్లు వెనక్కి వెళ్లిపోయింది అని ఆయన ఆరోపించారు. రాజధాని లేని రాష్ట్రంగా దిక్కులేని ప్రాంతంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలనతో రాష్ట్రం అధోగతి పాలైంది. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ముఖ్యంగా ఆ పార్టీ నేతల దోపిడీ భారీగా పెరిగిపోయింది. ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడేందుకు కారణమైంది. ఉచిత పథకాల వల్ల ప్రజలకు, రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు అని అన్నారు.

ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చేందుకు బదులుగా ఉపాధి మార్గం చూపాలి. దాని వల్ల ప్రజల జీవితం మెరుగుపడుతుంది. చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ మళ్లీ గాడిలో పడుతుంది. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తాయి. అందరికి ఉపాధి లభిస్తుంది అని మురళీమోహన్ అన్నారు.


Click it and Unblock the Notifications











