సిక్స్ ప్యాక్ కామెడీ ('పూల రంగడు' ప్రివ్యూ)
బిజినెస్ మ్యాన్ అనంతరం ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న చిత్రం పూల రంగడు. వర్మ రూపొందించిన అప్పలరాజు ప్లాప్ తో ఏడాది పైగా గ్యాప్ తీసుకుని సిక్స్ ప్యాక్ రెడీ చేసుకుని మరీ సునీల్ రంగంలోకి దూకాడు. అల్లరి నరేష్ తో అహనా పెళ్లంట చిత్రం రూపొందించిన వీరభద్రమ్ ద్వితీయ ప్రయత్నంగా చేసిన ఈ చిత్రంలో సునీల్ రంగ గా కనిపిస్తాడు. రంగ (సునీల్)ది హైదరాబాద్. పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతూ జల్సా చేస్తుంటాడు. అందుకే అతన్ని పూలరంగడు అని పిలుస్తారు. ఇంటిపోరు పడలేక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగితే.. అప్పులే మిగులుతాయి. ఆ తరవాత రంగ ప్రయాణం వరంగల్లుకి మారుతుంది. అక్కడ అనిత(ఇషాచావ్లా)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఇంతకీ రంగడు వరంగల్ ఎందుకు వెళ్లాడు? అనిత ప్రేమ దక్కిందా? లేదా? ఈ విషయాలతో అల్లుకొన్న కథ ఇది. కొండారెడ్డి (దేవ్ గిల్) పాత్ర కథలో కీలకం.
ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కథ ఇది. కొంచెం యాక్షన్ కూడా ఉంటుంది. సునీల్ వినోదం పండించే తీరు అందరికీ నచ్చుతుంది. కథనమే ఈ చిత్రానికి ప్రధాన బలం. చిక్కుముడులు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. సునీల్ నృత్యాలు ఆకట్టుకొంటాయి''అన్నారు.
సంస్థ: మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్
నటీనటులు: సునీల్, ఇషాచావ్లా, దేవ్‌గిల్, కోట శ్రీనివాసరావు, ప్రదీప్‌రావత్, అలీ, రఘుబాబు తదితరులు
సంగీతం: అనూప్
నిర్మాత: కె.అచ్చిరెడ్డి
దర్శకత్వం: వీరభద్రమ్
విడుదల: 18.ఫిబ్రవరి, శనివారం


Click it and Unblock the Notifications











