నాకు పక్షవాతం.. ఒకే జైలులో ఉంచండి.. పోసాని మొర.. అయినా 12 రోజుల రిమాండ్!
తెలుగు సినిమా పరిశ్రమలో నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. సామాజిక వర్గాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయనకు బెయిల్ లభించినా పీటీ వారెంట్లపై తిరిగి అరెస్టులు చేయడం కొనసాగుతూనే ఉంది. తాజాగా బెయిల్ లభించినా.. ఆయనను కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్‌పై విజయవాడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా జరిగిన వాదనల వివరాల్లోకి వెళితే..
నంది అవార్డుల కమిటీ గురించి, అలాగే సినీ పరిశ్రమలోని ప్రముఖులు, లోకేష్, చంద్రబాబు లాంటి రాజకీయ నేతలను దూషించిన కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో భాగంగా ఆయనను హైదరాబాద్‌లోని రాయదుర్గం మై హోం భుజా అపార్ట్‌మెంట్ నుంచి అదుపులోకి తీసుకొని ఏపీలో అరెస్ట్ చూపించారు. ఆయన అరెస్ట్ మీడియాలో పలు రకాల చర్చకు దారి తీసింది.

పోసానిపై తీవ్రమైన కేసులను సుమారుగా 17 కేసులను ఏపీ పోలీసులు నమోదు చేశారు. ఆయనపై 196, 353 (2), 111 రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసులను రిజిస్టర్ చేశారు. అనంతరం కడప జిల్లాలోని రాజంపేట కోర్టులో హాజరుపరిచారు. ఆయన బెయిల్ కోసం వైసీపీ వర్గానికి చెందిన న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. అనంతరం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. రాజంపేట సబ్ జైలులో ఉన్న ఆయనను కర్నూలులోని ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.
కర్నూలు జిల్లా జైలులో ఈ నెల 18వ తేదీ వరకు పోసానికి రిమాండ్ ఉంది. కానీ ఆయనను పీటీ వారెంట్‌పై విజయవాడకు చెందిన భవానీపురం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత ఆయనను విజయవాడ ఫస్ట్ ఏసీ ఎంఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టులో బెయిల్ ఇవ్వాలని పోసాని తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని విన్నవించుకొన్నారు.
అలాగే న్యాయవాదుల విన్నపాలే కాకుండా పోసాని కృష్ణ మురళి కూడా తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన అరోగ్యం బాగా లేదు. తాను పక్షవాతంతో బాధపడుతున్నాను. ప్రస్తుతం నేను నడువలేకపోతున్నాను. కాబట్టి మానవీయ కోణంలో తనకు బెయిల్ ఇచ్చేలా చూడాలని కోర్టును వేడుకొన్నారు.
తనకు గుండె ఆపరేషన్ అయింది. పక్షవాతానికి గురయ్యాను. నాపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియడం లేదు. పోలీసుల వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నాను. తనను ఒకే జైలులో ఉంచాలని వేడుకొన్నారు. అయితే పీటీ వారెంట్‌పై వచ్చినందున తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం పోసానికి 12 రోజులపాటు రిమాండ్ విధించారు.


Click it and Unblock the Notifications











