ప్రభాస్, ఆ హీరోయిన్... టైమ్ లెస్ లవర్స్, క్లూ ఇచ్చిన డైరెక్టర్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. బాహుబలి తర్వాత తన తర్వాతి సినిమా 'సాహో' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ సమయమే తీసుకున్న ఈ హీరో... ఇకపై వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సుజీత్ దర్శకత్వంలో రూ. 300 కోట్ల ఖర్చుతో భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న 'సాహో' ప్రభాస్ కెరీర్లో 19వ చిత్రం. హై టెక్నికల్ స్టాండర్డ్స్‍తో వరల్డ్ లెవల్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 15, 2019లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రభాస్-రాధాకృష్ణ మూవీ
సాహో మూవీతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రంలో కూడా ప్రభాస్(20) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. కృష్ణం రాజు నిర్మిస్తున్న మూవీ యూరప్ బ్యాక్ డ్రాపుతో ఒక పీరియడ్ ప్రేమకథ నేపథ్యంలో సాగుతుంది.

టైమ్ లెస్ లవర్లుగా ప్రభాస్, పూజా
ఈ మూవీ షూటింగ్ విశేషాల గురించి రాధాకృష్ణ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... ‘ప్రభాస్ 20 రెండో షెడ్యూల్ పూర్తయింది. 1970ల్లో యూరప్ బ్యాక్ డ్రాపుతో ఇద్దరు టైమ్ లెస్ లవర్ల మధ్య సాగే క్లాసిక్ స్టోరీ' అని తెలిపారు.

ప్రభాస్ 20 రిలీజ్ గురించి డైరెక్టర్ క్లూ..
ప్రభాస్ 20 రిలీజ్ డేట్ విషయంలో కూడా డైరెక్టర్ రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు. 2020 సంక్రాంతి లేదా 2020 ఫిబ్రవరిలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. దీన్ని బట్టి 2019లో ప్రభాస్ నుంచి ‘సాహో' తప్ప మరే సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయడానికి వీల్లేదు.

వరుస సినిమాలు చేయాలని డిసైడ్ అయిన ప్రభాస్
బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ చేస్తున్న సినిమాల సంఖ్య చాలా తగ్గిపోయింది. సంవత్సరానికి ఒక సినిమా కూడా థియేటర్లలోకి రావడం లేదు. వరుస పెద్ద హిట్లు కొడుతున్నప్పటికీ సినిమాల సంఖ్య తగ్గడంపై ఫ్యాన్స్ అసంతృప్తిలో ఉన్నారు. అయితే ‘సాహో' తర్వాత నుంచి సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











