Prabhas: వాళ్లు చేసిన పనికి మంటల్లో థియేటర్.. ప్రాణ భయంతో ప్రేక్షకుల పరుగులు
హీరోలు అంటే అభిమానులకు ప్రాణం. వారికోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడతారు. అయితే ఒక్కోసారి వారి ప్రేమ హద్దులు దాటుతుంది. తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమతో ఇతరులకు ఎలాంటి నష్టం కలుగుతుందనేది ఆలోచించట్లేదు ఫ్యాన్స్. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డార్లింగ్ అంటే అభిమానులకే కాదు సగటు సినీ ప్రేక్షకుడికి ఇష్టమే. అయితే అక్టోబర్ 23 అంటే ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రభాస్ స్టైలిష్ మూవీ బిల్లాను పలు ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ కు మంటలు అంటుకున్నాయి. మంటలు ఎలా అంటుకున్నాయనే వివరాళ్లోకి వెళితే..

యంగ్ రెబల్ స్టార్ గా ..
ఈశ్వర్ మూవీతో దివంగత కృష్ణంరాజు నటవారసుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక అప్పటినుంచి ప్రభాస్ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియాగానే ప్లాన్ చేస్తున్నాడు. కానీ పాన్ ఇండియాగా వచ్చిన సాహో, రాధేశ్యామ్ ప్రభాస్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో హీరోల కెరీర్ లో హిట్ సాధించిన సినిమాలు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ స్టైలిష్ మూవీగా పేరుగాంచిన బిల్లా మూవీని ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రదర్శించారు.

వెంకట్రామ థియేటర్ లో..
ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా పలు సెంటర్లోలో డార్లింగ్ మూవీస్ ల షోలు వేశారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పట్టణంలోని వెంకట్రామ థియేటర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిల్లా సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా ప్రదర్శిస్తుండగా.. యాక్షన్ సన్నివేశాలు వచ్చాయి. ఈ సీన్లు వచ్చినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. షో రన్ అవుతున్న సమయంలో పలువురు యువకులు బాణాసంచా కాల్చారు. దీంతో ఒక్కసారిగా థియేటర్ లో మంటలు చెలరేగాయి. కొన్ని సీట్లకు సైతం అగ్గి అంటుకుని పాక్షికంగా కాలిపోయాయి.

ప్రభాస్ ప్లకార్డులు పట్టుకుని..
ఇలా ఒక్కసారిగా థియేటర్ లో మంటలు వ్యాపించడంతో హాల్ మొత్తం పొగ వ్యాపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు ప్రాణ భయంతో థియేటర్ వదిలి బయటకు పరుగులు తీశారు. అయితే ఆ సమయంలో కూడా కొందరు ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ ప్లకార్డులు పట్టుకుని గట్టిగా కేకలు వేశారు. థియేటర్ ద్వారాల నుంచి బయటకు వెళ్లడం మంచిది అని కొందరు భావిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వెనక్కి తగ్గకుండా థియేటర్ లో రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ఆదిపురుష్, ప్రాజేక్ట్ కె, సలార్ సినిమాలతో వరుసగా అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











