హయ్యో.. ప్రభాస్ ఎందుకిలా?: 'సాహో'కి ఏమైంది.. ఆ సినిమానే ముందా?
ప్రభాస్ కెరీర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే... బాహుబలికి ముందు.. ఆ తర్వాత అనే మాట్లాడుకోవాలి. అప్పటిదాకా ప్రభాస్ ఏం చేసినా.. అదంతా తెలుగుకే పరిమితం. కానీ ఆ తర్వాత పరిస్థితి మారింది. ప్రభాస్ ఏ స్టెప్ తీసుకున్నా.. దేశవ్యాప్తంగా అదో హాట్ టాపిక్ అయిపోయే పరిస్థితి. ప్రభాస్ ప్రాజెక్ట్స్.. కమిట్ మెంట్స్.. ఇలా ప్రతీ విషయంలోనూ అన్ని ఇండస్ట్రీలు ఆయన్ను నిశితంగా గమనిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభాస్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెర పైకి వచ్చింది.

సాహో కంటే ముందు..:
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సాహో' సినిమా మరింత ఆలస్యమయ్యేలా ఉందట. దీంతో సాహో సెట్స్ పై ఉండగానే దర్శకుడు రాధాకృష్ణతో కమిట్ అయిన ప్రాజెక్ట్ ముందుగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. ప్రభాస్ కూడా సాహో కంటే ముందు రాధాకృష్ణతో చేసే సినిమానే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట.

పెరిగిన 'సాహో' బడ్జెట్..:
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో 'సాహో'పై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలితో పెరిగిన ప్రభాస్ మార్కెట్ ను పూర్తి స్థాయిలో అందుకునేలా చిత్రానికి హంగులు దిద్దుతున్నారు. ముందస్తుగా ప్లాన్ చేసుకున్న కొన్ని షెడ్యూల్స్ కూడా వాయిదా పడటంతో.. బడ్జెట్ కూడా రూ.150కోట్ల దాకా పెరిగిపోయింది. సినిమాకు హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు అక్కడినుంచి టెక్నీషియన్స్‌ను సైతం రంగంలోకి దించారు.

ఎందుకీ ఆలస్యం:
ఇక సాహో ఆలస్యానికి కారణమేంటా? అని ఆరా తీస్తే.. 'దుబాయ్ షెడ్యూల్' వల్లే అని తెలుస్తోంది. నిజానికి ఈ షెడ్యూల్ తోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని భావించినప్పటికీ.. చిత్రయూనిట్‌కు అనుకోని షాక్‌లు తప్పలేదు. తీరా దుబాయ్ వెళ్లాక.. అక్కడి అధికారులు 'నో' చెప్పడంతో.. అప్పట్లో తిరిగి హైదరాబాద్ వచ్చేశారు.

ఇప్పటికే రెండుసార్లు.. అంతా ఆ షెడ్యూల్ వల్లే:
ఓసారి దుబాయ్ అధికారుల నుంచి ఊహించని షాక్ తగలడంతో.. మరోసారి అన్నీ పక్కాగా చూసుకుని అక్కడి షెడ్యూల్ ప్లాన్ చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే అన్నీ సెట్ అయ్యాయని భావించినా.. అనుకోని కారణాలతో మరోసారి ఆ షెడ్యూల్ వాయిదా పడక తప్పలేదు. దీంతో రెండుసార్లు వాయిదా పడ్డ ఆ షెడ్యూల్ ను సుజిత్ ఎప్పుడు పూర్తి చేస్తాడో అర్థం కావడం లేదు.

సుజిత్ 'నో కాంప్రమైజ్'..:
నిజానికి సుజిత్ గనుకు కాంప్రమైజ్ ఆ షెడ్యూల్ ను వేరే లొకేషన్ లో షూట్ చేస్తే సాహో విడుదల ఇంత ఆలస్యమయ్యేది కాదేమో. కానీ సుజిత్ ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడం వల్లే సినిమా విడుదల మరింత ఆలస్యమవుతోంది. ఆలస్యంగా వచ్చినా సరే.. ఔట్ పుట్ లో సత్తా చూపించాలనేది సుజిత్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే లేటైనా లేటెస్ట్ గా రావడానికి సిద్దమవుతున్నాడట.

సంక్రాంతికి రాధాకృష్ణ సినిమా..:
ఇక రాధాకృష్ణతో మూవీ విషయానికొస్తే.. సాహోతో పాటే ఏక కాలంలో ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేయాలనుకుంటున్నాడు ప్రభాస్. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించనుంది. అయితే సాహో లాగా.. ఇది కూడా మల్టీ లింగ్వల్ సినిమా? కాదా? అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.


Click it and Unblock the Notifications











