Project K:'మహానటి'లా కాదు, కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలి.. ఆసక్తిగా నాగ్ అశ్విన్ వ్యాఖ్యలు
టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఇంటర్నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్.. అప్పటి నుంచి భారీ చిత్రాల్లోనే భాగం అవుతూ సత్తా చాటుతోన్నాడు. ఇలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. సరికొత్తతో ప్రాజెక్ట్ కె తెరకెక్కనుందని టాక్ అయితే వినిపిస్తోంది. తాజాగా ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

అక్టోబర్ 23న పోస్టర్..
కీర్తి సురేష్ నటించిన మహానటి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. టాలీవుడ్ లో పెద్ద సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సి. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె.. ప్రభాస్ సరసన జోడి కట్టనుంది. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కెలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న ఓ పోస్టర్ విడుదల చేసి సినిమాపై మరింత క్యూరియాసిటీ కలిగించారు.

అన్నీ కొత్తగా తయారు చేయాలి..
ప్రభాస్ ఒకకవచంతో గాలిలోకి దూసుకెళ్తున్నట్లు ఉంది ఆ పోస్టర్. ఇంకా ఆ పోస్టర్ పై హీరోలు పుట్టరు.. వాళ్లు ఎదుగుతారు అనే పదాలు ప్రభాస్ రోల్ ను ఎలివేట్ చేసేవిధంగా ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ఇది చాలా కొత్త సినిమా. స్క్రిప్ట్ కూడా కొత్తదే. దీనికోసం తయారు చేసే ప్రపంచం.. టెక్నిషీయన్స్ అంతా కొత్తగా ఉంటాయి. ఒకరకంగా ఈ సినిమా ఎలా చేయాలి అని ఆలోచించేందుకే చాలా సమయం పడుతుంది. అన్నీ కొత్తగా తయారు చేయాలి. మహానటి సినిమా కోసం కార్లు కావాలంటే రెంట్ కు తెచ్చుకున్నాం. రోజుకింత అంతా అని రెంట్ కు తెచ్చాం. కానీ ఈ సినిమాకు అలా కుదరదు. అన్నీ మేమే తయారు చేసుకోవాలి. కాబట్టి సినిమా అయితే కచ్చితంగా కొత్తగా ఉంటుంది" అని నాగ్ అశ్విన్ అన్నారు.

సినిమాపై మరింతగా అంచనాలు..
ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ కె ప్రకటించి దాదాపు రెండేళ్లు అవుతోంది. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పుడేం లేవు. అయితే సినిమా ఆలస్యం కావడంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. నాగ్ అశ్విన్ చెప్పిన ఈ విషయాలు సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయనే చెప్పవచ్చు. సినిమాకోసం ప్రతిదీ నిర్మించాలని తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా కోసం కెమికల్ ఇంజినీర్లను తీసుకున్నారని టాక్ వినిపించింది. ఇంకొంతమంది కొత్త టెక్నిషీయన్స్ ని కూడా తీసుకోనున్నారట. ప్రభాస్ ప్రాజెక్ట్ కెను 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట.


Click it and Unblock the Notifications











