ప్రభాస్ నాకంటే గొప్పవాడయ్యాడు...(రెబల్ ఆడియో రిలీజ్)
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తమన్నా, దీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన 'రెబల్' ఆడియో వేడుక గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తొలి సీడీనీ రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆవిష్కరించి దర్శకుడు రాజమౌళికి అందజేసారు.
ఈ సందర్భంగా కృష్ణం రాజు మాట్లాడుతూ...సినిమా లేట్ అయినప్పటికీ దర్శకుడు ఎంతో అద్భుతంగా చిత్రీకరించాడు. లారెన్స్‌లోని గొప్పతనం 'కాంచన' సినిమా చూసిన తర్వాత తెలుసుకున్నాను. ప్రభాస్ తన మొదటి సినిమా నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. మరో మెట్టు ఎక్కడానికి నెక్ట్స్ రాజమౌళితో మరో సినిమా ఉంది. ప్రభాస్‌లో ఉన్న గొప్పతనం ఏమిటంటే...గర్వం అనేది అతనికి తెలియదు. ఇంకా ఏదో చేయాలనే తాపత్రయం. నటనలో నాకంటే ఎప్పుడో గొప్పవాడు అయిపోయాడు. ఈ తరం యువత ప్రభాస్‌ని యూత్ ఐకాన్‌గా పోల్చడం ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో కృష్ణం రాజు, ప్రభాస్, లారెన్స్, ఎస్.ఎస్. రాజమౌళి, దిల్ రాజు, బ్రహ్మానందం, బెల్లకొండ సురేష్, ఎన్వీ ప్రసాద్, అశోక్ కుమార్, దీక్షాసేథ్, జె. భగవాన్, జె. పుల్లారావు, చలపతిరావు, అలీ, సుప్రీత్ తదితరులు హాజరయ్యారు. డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం, మాస్, డాన్, కాంచన లాంటి చిత్రాల దర్శకుడు రాఘవ లారెన్స్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ 'రెబల్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రభాస్ ఇమేజ్‌కి తగిన విధంగా ఈచిత్రాన్ని పుల్ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందించారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటోగ్రఫీ: సి. రాంప్రసాద్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేస్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నిర్మాత: జె. భగవాన్-పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











