ప్రదీప్‌పై ఆరోపణలు.. రియాక్ట్ అయిన బుల్లితెర యాంకర్
ఇన్నాళ్లు బుల్లితెరపై హంగామా చేసిన యాంకర్ ప్రదీప్ ఇక సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు తన తొలిసినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అయితే హీరోగా నటించడానికి ప్రదీప్ అర్హుడు కాదంటూ కొద్దిరోజుల క్రితం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం సెన్సేషన్ అయింది.
మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన సునిషిత్ అనే యువ దర్శకుడు ప్రదీప్‌పై బంజారాహిల్స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రదీప్ అమ్మాయిని వేధించిన కేసులో రెండు రోజులు జైలుకు వెళ్లాడు కాబట్టి సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్ రూల్స్ ప్రకారం.. ఆయన హీరోగా చేసేందుకు అనర్హుడు అంటూ ఆరోపణలు చేశాడు.

ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారి మరింత పెద్దది కావడంతో తాజాగా దీనిపై స్పందించాడు ప్రదీప్. తాను జైలుకు వెళ్లలేదని పేర్కొంటూ ఆ వార్తల్లో నిజంలేదని చెప్పాడు. గతంలో తాను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీస్ కౌన్సిలింగ్ కు మాత్రమే వెళ్ళాను కానీ జైలుకు వెళ్లలేదని అన్నాడు. తనపై కావాలనే ఇలాంటి ఆరోపణలు చేశారని పేర్కొన్నాడు. వాస్తవాలను తెలుసుకోవాలని, ఇలాంటి తప్పుడు సమాచారాలను ఎంకరేజ్ చేయొద్దని ప్రదీప్ పేర్కొన్నాడు.
ఇకపోతే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు మున్నా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ట్రెండ్ అయింది. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











