మరోసారి 'ఉత్తమ నటుడు' గా ప్రకాష్ రాజ్
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో సారి ఉత్తమనటుడు అవార్డును సాధించారు. 'కంజీవరం' చిత్రంలో ఆయనకు ప్రతిష్టాత్మక వి.శాంతారామ్ పురస్కారం దక్కింది. అలాగే ఈ చిత్రం మరిన్ని విభాగాల్లో అవార్డులుకు ఎంపికైంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (ప్రియదర్శన్), ఉత్తమ సినిమాటోగ్రఫి (తిరు) విభాగంలో కూడా అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రియదర్శన్ మాట్లాడుతూ "నా 27ఏళ్ల కెరీర్ లో నేను 79 చిత్రాలకు దర్శకుడుగా పని చేసాను. అయితే ఉత్తమ దర్శకుడి అవార్డును తీసుకోవటం మాత్రం ఇదే తొలిసారి. అలాగే 'కంజీవరం' చిత్రానికి ఇటీవలే జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. సంతోషం" అన్నారు.
ఇక 'దిల్ బోలే హడిప్పా'లో నటనకుగానూ రాణి ముఖర్జీ కు ఉత్తమ నాయికగా పురస్కారం దక్కింది. అలాగే మరాఠీ చిత్రం 'గభ్రిచా పాస్' ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకోగా.. సైఫ్ అలీఖాన్ తొలిసారిగా నిర్మించిన 'లవ్ ఆజ్ కల్' చిత్రం ఉత్తమ తృతీయ చిత్రంగా నిలిచింది. 'ఫిరాఖ్' చిత్రానికి ఉత్తమ నూతన దర్శకురాలు జాబితాలో నందితా దాస్ ఎంపికయ్యారు. 'న్యూయార్క్' చిత్రానికి సందీప్ శ్రీవాత్సవకు ఉత్తమ స్క్రీన్‌ప్లే.. 'లవ్ ఆజ్ కల్' చిత్రానికి ప్రీతమ్‌కు ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారాలు దక్కాయి. విజేతందరికీ దట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











